కూలీ దెబ్బ లోకేష్‌కు గ‌ట్టిగా తాకిందే..

ఈ మ‌ధ్య కాలంలో విప‌రీత‌మైన హైప్ తెచ్చుకుని.. ప్రేక్ష‌కుల‌ను అత్యంత నిరాశ‌కు గురి చేసిన చిత్రం అంటే.. కూలీ అనే చెప్పాలి. గ‌త నెల ఇండిపెండెన్స్ డే వీకెండ్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కూలీ’ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది కానీ.. ఆ తర్వాత నిలబడలేకపోయింది. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్లే ఆ సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. లేకుంటే పెద్ద డిజాస్టర్ అయ్యుండేది. కంటెంట్ పరంగా చూస్తే అది డిజాస్టర్ కావాల్సిన సినిమానే.

కూలీ చూశాక చాలామంది లోకేష్ క‌న‌క‌రాజ్ ఓవ‌ర్ రేటెడ్ డైరెక్ట‌ర్ అన్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దీని కంటే ముందు అత‌ను తీసిన లియో సినిమా కూడా అంచ‌నాల‌కు చాలా దూరంలో నిలిచిపోయింది. ప్రోమోల‌ను ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ది హైప్ తీసుకురావ‌డం త‌ప్ప‌.. కంటెంట్ మీద అత‌ను దృష్టిపెట్ట‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు ఈ రెండు చిత్రాల త‌ర్వాత బ‌ల‌ప‌డ్డాయి. కూలీ విడుద‌ల‌కు ముందు లోకేష్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి.

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ అని.. ఆమిర్ ఖాన్‌తో సూప‌ర్ హీరో మూవీ అని.. రోలెక్స్ పాత్ర మీద సినిమా అని.. ఖైదీ-2 అని.. ఇలా పెద్ద లిస్టే ప్రచారంలోకి వ‌చ్చింది. కానీ కూలీ రిలీజ్ త‌ర్వాత క‌థ మారిపోయింది. ముందుగా ఆమిర్‌తో లోకేష్ సినిమా క్యాన్సిల్ అనే న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. తాజాగా ర‌జినీ, క‌మ‌ల్ సినిమా కూడా అత‌డి చేజారిన‌ట్లే క‌నిపిస్తోంది. త‌మ క‌ల‌యిక‌లో సినిమాను ఖ‌రారు చేస్తూ.. ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది మాత్రం ఫిక్స్ కాలేద‌ని తేల్చేశాడు ర‌జినీ.

ఇక రోలెక్స్ సినిమా సంగ‌తి ఎప్పుడూ డోలాయ‌మాన‌మే. దాని గురించి లోకేష్ అప్పుడ‌ప్పుడూ హైప్ ఇవ్వ‌డ‌మే త‌ప్ప‌.. కాంక్రీట్‌గా ఆ సినిమా గురించి ఏ న్యూస్ లేదు. ఖైదీ-2 గురించి ఊరిస్తూనే ఉన్నాడు త‌ప్ప అదీ ముందుకు వెళ్ల‌ట్లేదు. ప్ర‌స్తుతానికి లోకేష్ హీరోగా ఒక సినిమా మొద‌లు కాబోతోంది. అది అయ్యాక ఖైదీ-2 ఉంటుందేమో చూడాలి. మొత్తానికి లియో, కూలీ సినిమాల త‌ర్వాత లోకేష్ మీద అంచ‌నాలు బాగా త‌గ్గిపోయాయి. అవ‌స‌రానికి మించి అత‌డికి హైప్ ఇచ్చామ‌ని ఇటు ఆడియ‌న్స్, అటు ఇండ‌స్ట్రీ జ‌నాలు అనుకుంటున్నారు.