తమ సినిమా అలా ఉండబోతోంది.. ఇలా ఉండబోతోంది అంటూ అంచనాలు పెంచడానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. కానీ ఉన్న హైప్‌ను తగ్గించడానికి దాని మేకర్స్ ట్రై చేయడం అరుదైన విషయం. ఇది మలయాళ ఇండస్ట్రీలో మాత్రమే చూడగలం. ‘లోకా’ సినిమాకు ఊహించని స్థాయిలో హైప్ వచ్చేసరికి, టీం భయపడి.. మరీ ఎక్కువ ఊహించుకోకండి అంటూ అంచనాలను తగ్గించే ప్రయత్నం చేసింది.
ఇప్పుడు దృశ్యం ఫ్రాంఛైజీ దర్శకుడు జీతు జోసెఫ్ కూడా ఇలాగే మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మోహన్ లాల్‌తో ఆయన తీసిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2′ ఎలాంటి అప్లాజ్ తెచ్చుకున్నాయో తెలిసిందే. ‘దృశ్యం’ అప్పటిదాకా ఉన్న మలయాళం ఫిలిం ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. ‘దృశ్యం-2’ కొవిడ్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజై అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. దీంతో ‘దృశ్యం-3’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఐతే ఆల్రెడీ స్క్రిప్టు రెడీ చేసి, త్వరలోనే షూటింగ్‌కు వెళ్లబోతున్న జీతు జోసెఫ్.. సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాల విషయమై ఆల్రెడీ ఒకసారి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి అతను అంచనాలను తగ్గించే ప్రయత్నం చేశాడు. దృశ్యం తొలి రెండు చిత్రాలతో పోల్చుకుని ఈ సినిమా చూడొద్దని ఆయన అంటున్నాడు. వాటితో పోలిస్తే ఈ సినిమా భిన్నంగా ఉంటుందన్నాడు.
ముందు భాగాల్లో మాదిరి హై ఇంటలిజెంట్ సీన్లు ఉంటాయని అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదు అని అతను తేల్చి చెప్పాడు. దృశ్యం, దృశ్యం-2 చిత్రాల్లో హీరో అసాధారణమైన తెలివితేటలతో పోలీసులను బురిడీ కొట్టించే సీన్లే హైలైట్‌గా నిలిచాయి. ఆ ప్లానింగ్, ట్విస్టులకు ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అయింది. దృశ్యం-3లో కూడా అలాంటి ఎపిసోడ్లు ఆశిస్తారనడంలో సందేహం లేదు.
ఐతే ఈసారి ట్విస్టులు, థ్రిల్స్ కంటే ఎమోషనల్ పార్ట్ ఎక్కువగా ఉంటుందని జీతు అంటున్నాడు. మరి సినిమా అలా నడిస్తే ప్రేక్షకులు నిరాశచెందే అవకాశముంది. అందుకే ముందుగానే వాళ్లను ప్రిపేర్ చేస్తున్నట్లున్నాడు జీతు. అలా అని జీతును తక్కువ అంచనా కూడా వేయలేం. అతను మోహన్ లాల్‌తో కలిసి ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడని, ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates