తెలుగులోకి మరో పవర్ స్టార్ ఎంట్రీ

పవర్ స్టార్ అనగానే మనకు పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు. కెరీర్ ఆరంభంలోనే ఆయన పేరు వెనుక ఆ బిరుదు చేరిపోయింది. ఆయన సౌత్ ఇండియా అంతటా పాపులరే. కానీ వేరే భాషల్లో కూడా పవర్ స్టార్‌లు ఉన్న సంగతి మన జనాలకు పెద్దగా తెలియదు. తమిళంలో శ్రీనివాసన్ అనే కమెడియన్ తన పేరు వెనుక ‘పవర్ స్టార్’ పెట్టుకున్నాడు. ఆయనవన్నీ కామెడీ వేషాలే కాబట్టి లైట్ తీసుకోవచ్చు. ఐతే కన్నడలో ఒక పెద్ద స్టార్ హీరోకు పవర్ స్టార్ బిరుదుంది. అతనే.. పునీత్ రాజ్ కుమార్. ఈ హీరో ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

అతడి కొత్త సినిమా ‘యువరత్న’ అదే పేరుతో తెలుగులో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఈ రోజే వెల్లడించారు. కన్నడ హీరోలకు తెలుగు మార్కెట్ మీద ఎప్పుడూ అంతగా దృష్టి ఉండేది కాదు. ఐతే ‘కేజీఎఫ్’తో వాళ్లకు ఆశలు పుట్టాయి. ఆ చిత్రాన్ని నిర్మించిన హోంబళె ఫిలిమ్సే ‘యువరత్న’ను ప్రొడ్యూస్ చేసింది. సంతోష్ ఆనండ్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ చిన్న కొడుకైన పునీత్.. తండ్రి నటించిన చాలా సినిమాల్లో బాల నటుడిగా మెరిశాడు. ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు కూడా సాధించాడు. మన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే పునీత్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ‘అప్పు’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్టయి పునీత్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చింది. ఈ సినిమానే తర్వాత ‘ఇడియట్’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది. 18 ఏళ్ల కెరీర్లో పునీత్‌ చాలానే బ్లాక్‌బస్టర్లు ఇచ్చాడు. ఒక్కడు, రెడీ లాంటి బ్లాక్ బస్టర్లను కన్నడలో పునీత్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడా భారీ విజయం సాధించాయి.

తెలుగులో డిజాస్టర్ అయిన ‘ఆంధ్రావాలా’ను కన్నడలో పూరి శిష్యుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో పునీత్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడది హిట్ కావడం విశేషం. ‘యువరత్న’లో ‘అఖిల్’ హీరోయిన్ సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతో పునీత్ తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.