టాలీవుడ్లో మాస్ డైలాగులు చెప్పడంలో బాలయ్యకు బాలయ్యే సాటి. సినిమాల్లో కమెడియన్లు, చిన్న హీరోలు ఆయన డైలాగులను అనుకరిస్తుంటారు కూడా. ఐతే ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ బాలయ్య డైలాగులను వల్లె వేస్తే.. అది అరుదైన విషయమే కదా. తాజాగా అదే జరిగింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో బాలయ్యకు హైదరాబాద్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకలో బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ సూపర్ స్టార్ రజినీకాంత్ పంపిన ఒక వీడియోను ప్రదర్శించారు. అంతే కాక బాలయ్యకు విషెస్ చెబుతూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక లేఖ పంపడం విశేషం. దాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. తన వీడియోలో బాలయ్య గురించి రజినీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. బాలయ్య డైలాగులతోనే ఆయన ఈ వీడియోను మొదలుపెట్టడం విశేషం. ఇంతకీ రజినీ ఏమన్నాడంటే..
ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు. కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా.. ఇలాంటి పంచ్ డైలాగులు బాలయ్య గారు చెబితేనే బాగుంటుంది. వేరే వాళ్లు కాదు.
బాలయ్య అంటేనే పాజిటివిటీ అండీ. నెగెటివిటీ ఆయన దగ్గర కొంచెం కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆ సంతోషం, ఆ నవ్వు,ఆ పాజిటివిటీ ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే. వేరే ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతోంది అంటే ఆయన అభిమానులు మాత్రమే కాదు.. వేరే హీరోల అభిమానులందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అందుకు ఆయనకు నా అభినందనలు. ఆయన ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఇలాగే నటిస్తూ, పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ, ఇండస్ట్రీలో 75 ఏళ్లు పూర్తి చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఐ లవ్యూ బాలయ్య అని రజినీ పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates