మిరాయ్… ఈసారి మాత్రం పక్కా

టాలీవుడ్లో అరుదు అన‌ద‌గ్గ సూప‌ర్ హీరో జాన‌ర్లో తెర‌కెక్కిన సినిమా.. మిరాయ్. హ‌నుమాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు తేజ స‌జ్జా ఇందులో లీడ్ రోల్ చేశాడు. టీజ‌ర్ చూస్తే సినిమా ఆషామాషీగా ఏమీ తీయ‌లేద‌ని అర్థ‌మైంది. సినిమాటోగ్రాఫ‌ర్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని విజ‌న్‌ను న‌మ్మి పీపుల్స్ మీడియా సంస్థ భారీ బ‌డ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించింది. ఇందులో మంచు మ‌నోజ్ విల‌న్ పాత్ర చేయ‌డం మ‌రోహైలైట్. అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం ఫేమ్ రితిక యాద‌వ్ తేజ‌కు జోడీగా న‌టించిందీ చిత్రంలో.

చాలా ముందే రావాల్సిన ఈ సినిమా.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఆల‌స్యం వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. సెప్టెంబ‌రు 5న కూడా సినిమా రిలీజ్ కావ‌ట్లేదు. ఇంకో వారం ఆల‌స్యంగా 12న రిలీజ్ అని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అధికారికంగానే ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. డేట్ క‌న్ఫ‌మ్ చేస్తూ ట్రైల‌ర్ గురించి కూడా స‌మాచారం ఇచ్చారు. వినాయ‌క చ‌వితి మ‌రుస‌టి రోజైన ఆగ‌స్టు 28న ట్రైల‌ర్ లాంచ్ కాబోతోంది. తేజ‌-మ‌నోజ్ స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్‌తో ట్రైల‌ర్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్ప‌టికే మంచి హైప్ ఉన్న సినిమా మీద మరింత అంచ‌నాలు పెంచేలా ట్రైల‌ర్ ఉండ‌బోతోంద‌ని చిత్ర వ‌ర్గాల టాక్.

క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్, ఎఫెక్ట్స్, స్ట్రైకింగ్ షాట్స్‌తో ట్రైల‌ర్ క‌నుల విందుగా ఉంటుంద‌ని.. హ‌నుమాన్ త‌ర్వాత పాన్ ఇండియా స్థాయిలో తేజ సినిమా మీద బ‌జ్ క్రియేట‌య్యేలా ట్రైల‌ర్‌ను తీర్చిదిద్దార‌ని అంటున్నారు. టీజ‌ర్ తర్వాత పెద్ద‌గా హ‌డావుడి చేయ‌ని చిత్ర బృందం.. ట్రైల‌ర్‌ను మాస్ట‌ర్ స్ట్రోక్‌గా భావిస్తోంది. ట్రైల‌ర్ వ‌చ్చాక రెండు వారాల పాటు పాన్ ఇండియా స్థాయిలో సినిమాను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసేలా ప్లానింగ్ జ‌రుగుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఇప్ప‌టికే ఒక కొలిక్కి వ‌చ్చాయి. ప‌ది రోజుల ముందే ఫ‌స్ట్ కాపీ తీసేయ‌బోతున్నారు. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ట్రైల‌ర్ ఎంత మేర‌ ఆక‌ట్టుకుంటుందో.. సినిమాకు బ‌జ్‌ను పెంచుతుందో, త‌గ్గిస్తుందో చూడాలి.