‘ఆచార్య’ సెట్లో సోనూ సూద్‌ కోసం..

లాక్ డౌన్ టైంలో అసాధారణ రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టి.. ఇప్పుడు కూడా చారిటీని కొనసాగిస్తున్న రియల్ హీరో సోనూ సూద్‌ ఎక్కడికెళ్లినా జనం నీరాజనం పడుతున్నారు. సామాన్య జనమే కాదు… ఫిలిం సెలబ్రెటీలు సైతం అతడి సేవకు అబ్బురపడి సోనూను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. గత నెలలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చిత్రీకరణకు హాజరైన సోనూను లెజెండరీ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ సత్కరించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో సినిమా సెట్లో ఇంకో దిగ్గజ నటుడు సోనూను సత్కరించడం విశేషం. ఆ నటుడు తనికెళ్ల భరణి కాగా.. సోనూను ఆయన సత్కరించింది మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ సెట్లో కావడం విశేషం. భరణి తనదైన రీతిలో సోనూ సేవలను కొనియాడుతూ దర్శకుడు కొరటాల శివ, ఇతర యూనిట్ సభ్యుల సమక్షంలో ఆత్మీయ సత్కారం చేశారు.

సినీ రంగంలో సంపద ఉంటుందని అందరూ అనుకుంటారని.. కానీ ఇక్కడ సాయం చేయాలనే మనసు కూడా ఉంటుందని సోనూ నిరూపించాడని.. లాక్ డౌన్ టైంలో ప్రజల కష్టాలను చూసి చలించిపోయి అద్భుత రీతిలో సోనూ సేవా కార్యక్రమాలు చేపట్టి ఎందరో అభాగ్యులను ఆదుకున్నాడని భరణి అన్నాడు. బేసిగ్గా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించేవాళ్లు మంచి వాళ్లు అయ్యుంటారని.. సోనూనే అందుకు ఉదాహరణ అని చెప్పిన భరణి.. తాను కూడా విలన్ పాత్రలు చేశా కాబట్టి మంచోడినే అంటూ చమత్కరించారు భరణి.

సినీ పరిశ్రమ గర్వించేలా సోనూ గొప్పగా సేవా కార్యక్రమాలు చేపట్టాడని కొనియాడిన భరణి.. అనంతరం కొరటాలతో కలిసి సోనూకు శాలువా కప్పి అతణ్ని సత్కరించాడు. అలాగే కొరటాలను, సినిమాటోగ్రాఫర్ తిరును కూడా ఆయన సన్మానించారు. అనంతరం పంచముఖ ఆంజనేయుడి విగ్రహాన్ని సోనూకు బహుకరించారు. మామూలుగా అయితే చిరునే సోనూను సత్కరించేవారు కానీ.. ఆయన ఈ సినిమా షూటింగ్‌కు హాజరు కావడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ లోపు ఇతర యూనిట్ సభ్యులతో కొరటాల షూటింగ్ చేస్తున్నాడు. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా సోనూ కూడా ‘ఆచార్య’లో నటిస్తున్నాడన్న సంగతి వెల్లడైంది. మరి ఇందులో అతనెలాంటి పాత్ర చేస్తున్నాడన్నది ఆసక్తికరం.