హీరోను వెనక్కి తోసేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్

తెలుగు సినిమాల్లో హీరోలకు ఉండే ప్రాధాన్యం వేరు. చిన్నదైనా, పెద్దదైనా.. దాదాపు ప్రతి సినిమాలోనూ హీరోనే హైలైట్ అవుతుంటాడు. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతగా పెర్ఫామ్ చేసినా.. హీరోలను డామినేట్ చేసే సందర్భాలు అరుదుగా వస్తుంటాయి. ఐతే స్క్రీన్ స్పేస్‌తో సంబంధం లేకుండా కొన్నిసార్లు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులు చెలరేగిపోయి హీరోలను డామినేట్ చేస్తుంటారు.

తెలుగులో కొత్తగా రిలీజైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లో ఇదే జరిగింది. ఇందులో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తొలి సినిమా ‘దొరసాని’తో పోలిస్తే బాగానే నటించినా.. అతడి తండ్రి పాత్రలో కనిపించిన గోపరాజు రమణ సినిమాలో బాగా హైలైట్ అయిపోయాడు. ఈ నటుడు చాలా ఏళ్ల నుంచే ఇండస్ట్రీలో ఉన్నాడు. సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటించాడు. కానీ తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం అవి ఆయనకు ఇవ్వలేదు.

ఐతే ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లో తండ్రి పాత్ర గోపరాజు రమణ కోసమే పుట్టినట్లుంది. తనకు పట్టున్న గుంటూరు యాసలో డైలాగులు చెప్పే అవకాశం రావడం, పాత్రను బాగా తీర్చిదిద్దడంతో ఆయన చెలరేగిపోయారంతే. పెద్దగా పేరు లేని నటుడే అయినా.. ఈ సినిమా చూడటం మొదలుపెట్టిన కొన్ని నిమిషాలకే ఆ పాత్రతో ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతారు. పల్లెటూళ్లలో చాలా కఠినంగా కనిపించే తండ్రుల పాత్రలను డిట్టో దించేస్తూ ఆ పాత్రను అద్భుతంగా పండించాడు గోపరాజు రమణ.

తన కొడుకు తన ప్రేమ గురించి చెప్పినపుడు స్పందించే తీరు చూస్తే.. ఆ సీన్ థియేటర్లలో అయితే కేరింతలతో హోరెత్తిపోయేదనిపిస్తుంది. దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ ఈ పాత్ర ఆసక్తి రేకెత్తిస్తుంది. తెరపై మిగతా పాత్రలన్నింటినీ పక్కకు నెట్టేసి హైలైట్ అవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నది గోపరాజు రమణ గురించే. ఉన్నంతలో మంచి టాకే తెచ్చుకున్న ఈ సినిమా ఆనంద్‌కు ఏమాత్రం ఉపయోగపడుతుందో కానీ.. గోపరాజు రమణ కెరీర్‌కు మాత్రం ఇది మంచి మలుపయ్యేలా ఉంది.