జూలై 24 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు మీద ఇటీవలే చిన్నపాటి వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. తెలంగాణ యోధుడు పండుగ సాయన్న కథను తప్పుగా చూపిస్తున్నారని చెబుతూ కొందరు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే నిర్మాత ఏఎం రత్నం వాటికి చెక్ పెడుతున్నారు. ఇది పూర్తిగా ఫిక్షన్ కథని, విష్ణు శివుడు అంశతో పుట్టిన ఒక వీరుడు సనాతన ధర్మం కోసం ఏం చేశాడనే పాయింట్ మీద ఈ సినిమా రూపొందిందని క్లారిటీ ఇస్తున్నారు. అయ్యప్పస్వామి, గరుడం, డమరుకం తదితర రెఫరెన్సులతో సరికొత్త మైథలాజికల్ టచ్ తో దర్శకుడు జ్యోతికృష్ణ కొత్త ట్రీట్ మెంట్ ఇచ్చారణ చెప్పుకొచ్చారు.
గతంలో ఆర్ఆర్ఆర్ టైంలోనూ ఇలాంటి కాంట్రవర్సీ పెద్ద ఎత్తున తలెత్తింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు కలిసి పోరాటం చేసినట్టు తప్పుగా చూపించారని, రాజమౌళి చరిత్రను వక్రీకరించారని కొందరు మనోభావాల పేరిట కొద్దిరోజులు హడావిడి చేశారు. తర్వాత మెల్లగా అది సద్దుమణగగా సినిమా రిలీజయ్యాక చూసినవాళ్లకు జక్కన్న మళ్ళీ మాట్లాడే అవసరం రానివ్వలేదు. ఇప్పుడు వీరమల్లు కూడా అదే ఫార్ములా వాడబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు పండగ సాయన్న కథగా ప్రచారం జరిగింది. బహుశా ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబోలు.
వీటి సంగతి ఎలా ఉన్నా రిలీజ్ కు బ్రేకులు పడే అవకాశాలు దాదాపు లేనట్టే. డిస్ట్రిబ్యూటర్లు ఒక్కొక్కరుగా ఫిక్స్ అవుతున్నారు. యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే మొదలైపోయాయి. కీరవాణి రీ రికార్డింగ్ కొంచెం బ్యాలన్స్ ఉందని తెలిసింది. ఆయన తండ్రి శివశక్తి హఠాన్మరణం వల్ల కొంత ఆలస్యం జరగొచ్చేమో కానీ విడుదల తేదీ మిస్ అయ్యే అవకాశాలు లేవు. హరిహర వీరమల్లుకు ఓపెన్ గ్రౌండ్ దొరికింది. కుబేర హిట్టు తర్వాత వచ్చిన కన్నప్ప, తమ్ముడు తీవ్రంగా నిరాశపరిచాయి. కంటెంట్ కనక అన్ని వర్గాలకు కనెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ చేయబోయే రికార్డుల రచ్చ మాములుగా ఉండదు. ఫ్యాన్స్ దానికోసమే వెయిటింగ్.
Gulte Telugu Telugu Political and Movie News Updates