అల్లు అరవింద్.. జాక్ పాట్ మిస్సయ్యాడా?

తెలుగులో ఇంకా దృఢంగా నిలబడి సినిమాలు తీస్తూ విజయవంతంగా సాగిపోతున్న సీనియర్ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన తరం నిర్మాతల్లో ఎంతోమంది ఇండస్ట్రీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. సక్సెస్ రేట్ బాగా పడిపోయి, బడ్జెట్లు పెరిగిపోయి, ప్రొడక్షన్ నిర్మాతల చేతుల్లో లేని ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు తీయడం చాలా కష్టం అన్నది ఆ తరం నిర్మాతల అభిప్రాయం. కానీ అరవింద్ మాత్రం ట్రెండుకు తగ్గట్లు తనను తాను మార్చుకుంటూ, అప్‌డేట్ అవుతూ విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఐతే ఒకప్పట్లా ఆయన పెద్ద సినిమాలు తీయడం మాత్రం తగ్గించేశారు. ఎప్పుడైనా అల్లు అర్జున్‌తో, వేరే వాళ్లను కలుపుకుని పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నారే తప్ప.. అంతకుమించి రిస్క్ చేయట్లేదు. ఐతే లేక లేక అరవింద్ ఓ భారీ బడ్జెట్ సినిమా తీయడానికి కొన్నేళ్ల ముందు సన్నాహాలు చేసుకున్నారు. అదే.. రామాయణం. బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, వేరే బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ఆయన ఈ మెగా ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.

కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఇలాగే ఏళ్లు గడిచిపోయాయి. కట్ చేస్తే గత ఏడాది ‘రామాయణం’ సెట్స్ మీదికి వెళ్లింది. కానీ ఆ ప్రాజెక్టులో అరవింద్ లేరు. మధు మంతెన సైతం మిస్ అయ్యారు. ముందు వీళ్లు ప్రకటించినట్లే నితీశ్ తివారి దర్శకత్వంలోనే సినిమా మొదలైంది. కానీ కాస్ట్ అండ్ క్రూలోనూ మార్పులు జరిగాయి. అరవింద్ భాగస్వామిగా ఉండగా ఇందులో మహేష్ బాబును రాముడిగా చూపించాలన్న చర్చ కూడా జరగడం విశేషం. వేరే ఆప్షన్లు కూడా కొన్ని వినిపించాయి. కానీ చివరికి రణబీర్ కపూర్ హీరోగా సినిమా మొదలైంది.

అరవింద్ ఏ కారణంతో ఈ సినిమా నుంచి బయటికి వచ్చేశారో కానీ.. ఇటీవల రిలీజైన షో రీల్ చూశాక ఆయన గొప్ప అవకాశాన్ని మిస్సయ్యారా అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇది ఇండియన్ బాక్సాఫీస్‌లో ‘బాహుబలి’ తరహాలో సెన్సేషన్ క్రియేట్ చేయగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో అరవింద్ భాగస్వామిగా ఉంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గీతా ఆర్ట్స్ పేరు మార్మోగేదని.. అది టాలీవుడ్‌కు కూడా గర్వకారణంగా ఉండేదని. ఆయన మంచి ఛాన్స్ మిస్సయ్యారని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.