చిన్న సీన్.. పెద్ద దుమారమే

ఏఐఆర్.. విడమరిచి చెబితే ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’.. ఈ వీకెండ్లో ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’తో ఒక కొత్త ఒరవడి సృష్టించిన ఈటీవీ విన్ నుంచి వచ్చిన మరో క్వాలిటీ సిరీస్‌గా దీనికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మంచి ఆదరణ దక్కుతోందని సంతోషించే లోపే ఈ సిరీస్‌ చుట్టూ ఓ వివాదం ముసురుకుంది. ముందు చిన్న గొడవే అనుకున్నారు కానీ.. కొన్ని గంటల్లోనే అది పెద్ద దుమారంగా మారిపోయింది.

ఒక కులాన్ని టార్గెట్ చేసేలా ఇందులో ఉన్న ఓ సన్నివేశం ఆ వర్గానికి చెందిన మనోభావాలను దెబ్బ తీయడంతో తెలుగు సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ‘ఏఐఆర్’ హాస్టల్లో ఉంటూ చదువుకునే ఇంటర్మీడియట్ కుర్రాళ్లకు సంబంధించిన కథ. ఈ స్టూడెంట్స్‌లో క్యాస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది.. కొత్త వాళ్ల మీద దాన్ని ఎలా రుద్దుతారు.. సినిమా హీరోలను అభిమానించే విషయంలోనూ కులం ఎలా కీలక పాత్ర పోషిస్తుంది.. కొన్ని సన్నివేశాల్లో చూపించారు. ఈ క్రమంలోనే సదరు వివాదాస్పద సన్నివేశం వస్తుంది. ఫలానా కులం పేరు పెట్టకపోయినా.. ఏ క్యాస్ట్‌ను టార్గెట్ చేశారన్నది అక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది.

వెటకారంగా ఉన్న ఆ సీన్ సదరు కులం వాళ్లకు తీవ్ర అభ్యంతరకరంగా అనిపించి.. ఈ సిరీస్ మేకర్స్‌‌తో పాటు ఈటీవీ విన్‌ను టార్గెట్ చేశారు. అసలే సన్నివేశం అభ్యంతరకరంగా ఉంటే.. దానికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులను ‘ఈటీవీ విన్’ ఎక్స్ హ్యాండిల్లో రీపోస్ట్ చేయడం ఈ వివాదం మరింత ముదరడానికి కారణమైంది. కొన్ని గంటల్లోనే ఈ టాపిక్ దావానలంలా మారిపోవడంతో.. ఈటీవీ విన్ ఇకపై జాగ్రత్తగా ఉంటామంటూ పోస్ట్ పెట్టింది. మరోవైపు ఈ సిరీస్ నిర్మాత అయిన దర్శకుడు సందీప్ రాజ్‌ను ఆ వర్గం గట్టిగానే టార్గెట్ చేసింది.

దీంతో అతను సుదీర్ఘ వివరణ ఇస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాడు. సాకులేమీ వెతక్కుండా, కవర్ చేయడానికి ప్రయత్నించకుండా ఇది చెత్త సీన్ అని స్పష్టం దాన్ని సిరీస్ నుంచి తీసేశామని వెల్లడించాడు. అయినా సందీప్‌ను నెటిజన్లు విడిచిపెట్టడం లేదు. ఇలా తమ కులాన్ని టార్గెట్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందంటూ, దీని వెనుక ఎవరో ఉన్నారంటూ వాళ్లు మండిపడుతున్నారు. వివాదాలకు దూరంగా ఉండే ‘ఈటీవీ’ గ్రూప్ నుంచి ఇలాంటి కంటెంట్ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.