బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హిట్టు కోసం ఎంతగా తపించిపోతున్నాడో చూస్తున్నాం. సికందర్ ఆశలు తీరుస్తుందేమో అనుకుంటే అదింకా దారుణంగా పోయి సక్సెస్ ఊపులో ఉన్న రష్మిక మందన్నకే డిజాస్టర్ ఇచ్చింది. భాయ్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకోవడం ఇప్పుడు బాధగా మారిపోయింది. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సినిమాల కోసం కష్టపడుతున్నానని చెబుతున్న సల్మాన్ ఖాన్ నిర్ణయాలు తీసుకోవడంలో పదే పదే తప్పటడుగులు వేయడాన్ని స్వంత ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. తాజాగా భాయ్ కొత్త మూవీ బాటిల్ అఫ్ గాల్వన్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. ఇది కాదు అసలు విశేషం
ఈ గాల్వన్ దర్శకుడు అపూర్వ లఖియా. ఎక్కడో విన్నట్టు ఉంది కదూ. రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ తుఫాన్ / జంజీర్ తెరకెక్కించింది ఇతనే. అమితాబ్ బచ్చన్ కల్ట్ క్లాసిక్ రీమేక్ చేసే క్రమంలో తీసికట్టు కథా కథనాలతో చరణ్ ట్రోలింగ్ బారిన పడేలా చేశాడు. తర్వాత ఏమైనా ట్రాక్ రికార్డు మారిందా అంటే అదీ లేదు. ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో కేవలం ఒకే సినిమా హసీనా పార్కర్ తీశాడు. అది కూడా అట్టర్ ఫ్లాపే. క్రాక్ డౌన్ అనే వెబ్ సిరీస్ చేశాడు కానీ అది కూడా సోసోగానే వెళ్ళింది. కెరీర్ మొత్తం మీద చెప్పుకోదగ్గ సినిమా షూట్ అవుట్ అట్ లోఖండ్ వాలా, ఆపరేషన్ ఇస్తాన్ బుల్ మాత్రమే.
క్రేజ్ ఉన్న డైరెక్టర్ల వెంటపడకుండా సల్మాన్ ఖాన్ ఇలా ఫ్లాప్ దర్శకులను ఎంచుకోవడం పట్ల ఫ్యాన్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఒకపక్క జవాన్, పఠాన్ లతో సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. నిర్మాణంలో ఉన్న కింగ్ అప్పుడే అంచనాలు పెంచేస్తోంది. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ తో సక్సెస్ అందుకున్నాడు. అక్షయ్ కుమార్ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఎటొచ్చి ఎదురీదుతున్నది సల్మాన్ ఖాన్ ఒక్కడే. మరి బ్యాటిల్ అఫ్ గాల్వన్ అయినా ఊరట ఇస్తుందేమో చూడాలి. ఎటొచ్చి అందరి అనుమానం అపూర్వ లఖియా మీదే ఉంది. చూడాలి ఏం చేస్తాడో.
Gulte Telugu Telugu Political and Movie News Updates