సూర్య అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే..

కరోనా కాలంలో దక్షిణాదిన చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో విడుదలయ్యాయి. కానీ వాటిలో చాలా వరకు చిన్న సినిమాలే. ఈ మధ్య వి, నిశ్శబ్దం లాంటి కొంచెం పెద్ద స్థాయి సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటిని మినహాయిస్తే అన్ని చిన్న రేంజివే. ఐతే ఇప్పుడు సూర్య లాంటి సూపర్ స్టార్ నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఈ సినిమా ఇలా రిలీజ్ కాబోతున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటన వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు.

సూర్య లాంటి పెద్ద హీరో ఇంకొంత కాలం సినిమాను హోల్డ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసుకోలేడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయమై తమిళనాడు ఎగ్జిబిటర్లు సూర్య మీద ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించారు. అయినా సరే.. సూర్య తగ్గలేదు. తన భార్య జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాల్’ రిలీజపుడే ‘ఆకాశం నీ హద్దురా’ డిజిటల్ రిలీజ్ గురించి సంకేతాలిచ్చిన సూర్య.. తర్వాత అన్నంత పనీ చేశాడు.

ఐతే ఇదేమీ తాను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదని సూర్య తాజాగా వెల్లడించాడు. థియేటర్ల పున:ప్రారంభం కోసం ఎదురు చూడలేని విపత్కర పరిస్థితి తనకు తలెత్తినట్లు అతను తెలిపాడు. తన నిర్మాణంలో ఏడు సినిమాలు సెట్స్ మీద ఉన్న సమయంలో కరోనా వచ్చిందని.. దీంతో ఈ చిత్రాల్లో భాగమైన వ్యక్తలకు చెందిన వందల కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకం అయిందని అతను చెప్పాడు. ఒక దశలో తన దగ్గర నిధులు నిండుకుని వాళ్లకు జీతాలివ్వలేని పరిస్థితి తలెత్తిందని.. ఆ పరిస్థితుల్లో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను అమేజాన్ వాళ్లకు అమ్మేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో ఈ కుటుంబాలను ఆదుకోగలిగానని చెప్పాడు.

తన చిత్రాన్ని థియేటర్ల కోసమే సిద్ధం చేశామని, కానీ అనివార్య పరిస్థితుల్లో ఇలా రిలీజ్ చేయాల్సి వచ్చిందని, ఐతే ఈ మార్గంలో మరింత మందికి రీచ్ అవుతున్నందుకు సంతోషమే అని తెలిపాడు. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ రెండు రోజుల కింటే ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది.