అనుష్క బాటలో రష్మిక మందన్న రిస్కులు

వరస బ్లాక్ బస్టర్లు పడి ఎక్కువ అవకాశాలు వచ్చి కెరీర్ దివ్యంగా ఉన్న టైంలో రిస్క్ చేసేందుకు హీరోయిన్లు ఇష్టపడరు. కానీ కొందరు మాత్రమే ప్రయోగాలకు సై అంటారు. రష్మిక మందన్న కేవలం ఆఫర్లనే కాకుండా తనకు నటన పరంగా ఛాలెంజ్ అనిపించే వాటిని ఎంచుకోవడంలో శ్రద్ధ చూపిస్తోంది. ఒక్కోసారి హీరో దర్శకుడి ట్రాక్ రికార్డు ఏంటనేది కూడా పట్టించుకోవడం లేదు. ది గర్ల్ ఫ్రెండ్ దానికి మంచి ఉదాహరణ. బాలీవుడ్ హారర్ మూవీ తమకు ఎస్ చెప్పడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు అలాంటి మరో ఎక్స్ పరిమెంట్ మూవీ తన ఖాతాలో వేసుకుంటోంది. అదే ఇవాళ ఫస్ట్ లుక్ రీలీజైన మైసా.

మైసా గెటప్ చూస్తే రష్మిక మందన్న చాలా వయొలెంట్ యాంగిల్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు కనిపిస్తోంది. డీటెయిల్స్ ఎక్కువ చెప్పలేదు కానీ ఇప్పటిదాకా తనకు పరిచయం లేని సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దీనికి దర్శకుడు రవీంద్ర పూలే. ఇతని గత చిత్రం అర్ధ శతాబ్దంకు కొన్ని ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన విజయం అందుకోలేదు. అయితే మైసా పూర్తిగా షాకింగ్ కంటెంట్ తో రూపొందిందని, అయిదు భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో దీన్ని రిలీజ్ చేస్తారని యూనిట్ చెబుతోంది. ఇక్కడ అనుష్క టాపిక్ ఎందుకు వచ్చిందో చూద్దాం.

మంచి ఫామ్ ఉన్న టైంలో అనుష్క అరుంధతి ద్వారా తన మార్కెట్ ని పెంచుకుంది. ఆ సినిమా సాధించిన విజయం మాస్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసింది. అలాని స్టార్ హీరోల పక్కన చేయడం మానుకోలేదు. రెండు బాలన్స్ చేసుకుంటూ సాగింది. ఇప్పుడు రష్మిక మందన్న ప్లానింగ్ కూడా అనుష్క ప్లానింగ్ ని గుర్తు చేస్తోంది. ఇటీవలే కుబేరతో ఇంకో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న శ్రీవల్లికి గత రెండేళ్లలో దక్కిన ఒకే ఒక డిజాస్టర్ సల్మాన్ ఖాన్ సికందర్ ఒక్కటే. మిగిలిన యానిమల్, పుష్ప 2, చావా, కుబేర ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయం అందుకున్నాయి. ఇలాంటి టైంలో రిస్కులు మంచిదే.