హౌస్ ఫుల్ బోర్డులు.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు

థియేట‌ర్ల‌కు వ‌చ్చే జ‌నం రోజు రోజుకూ త‌గ్గిపోతున్న ప‌రిస్థితుల్లో ఇండ‌స్ట్రీ ఉనికే ప్ర‌మాదంగా మారుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి ఈ మ‌ధ్య‌. స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కూ ప‌డిపోతుండ‌డం.. స్టార్లు ఉన్న సినిమాలకు పైగా ఓపెనింగ్స్ క‌ర‌వైపోతుండ‌డం.. చిన్న సినిమాలను అస‌లే ప‌ట్టించుకోక‌పోవ‌డం చూసి ఇండ‌స్ట్రీ జ‌నాలు కంగారెత్తిపోయారు. ఒక‌ప్పుడు క్రేజీ సీజ‌న్ అయిన స‌మ్మ‌ర్లో స‌రైన సినిమాలు లేక థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి. హిట్-3, సింగిల్ సినిమాల త‌ర్వాత నెల రోజుల పాటు బాక్సాఫీస్ బోసిపోయింది. జూన్ నెల ఆశాజ‌న‌కంగా క‌నిపించింది కానీ.. తొలి వారం వ‌చ్చిన థ‌గ్ లైఫ్ డిజాస్ట‌ర్ కావ‌డం, తర్వాతి వారం రావాల్సిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు వాయిదా ప‌డిపోవ‌డంతో ఈ నెల కూడా వేస్టేనా అన్న సందేహాలు క‌లిగాయి.

మంచి సినిమా వ‌స్తే చూద్దామని ప్రేక్ష‌కులు రెడీగా ఉన్నా.. వారి ఆశ తీర్చే మూవీ లేక ఉస్సూరుమనే ప‌రిస్థితి. ఇలాంటి టైంలో శేఖ‌ర్ క‌మ్ముల అంద‌రి క‌ర‌వూ తీర్చేశాడు. ధ‌నుష్‌, అక్కినేని నాగార్జున‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌మ్ముల రూపొందించిన కుబేర మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో సంద‌డి తీసుకొచ్చింది. చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు క‌నిపించాయి ఈ రోజు. ఆన్ లైన్లో సాయంత్రం షోల‌న్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. సోల్డ్ ఔట్ షోలూ క‌నిపిస్తున్నాయి. మ‌ళ్లీ ఇలాంటి సంద‌డి క‌నిపించ‌డంతో ఇండ‌స్ట్రీ అంతా ఖుషీగా ఉంది.

నిజానికి కుబేర‌కు కూడా కొన్ని రోజుల ముందు వ‌ర‌కు పెద్ద‌గా బ‌జ్ లేదు. కంటెంట్ మ‌రీ సీరియ‌స్‌గా క‌నిపించ‌డంతో ఇది ఏమాత్రం ఆద‌ర‌ణ పొందుతుందో అన్న సందేహాలు క‌లిగాయి. త‌మిళంలో అయితే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స‌రిగా జ‌ర‌గ‌లేదు. తెలుగులో ప‌రిస్థితి కొంచెం మెరుగ్గా కనిపించింది. అయినా సినిమా ఎలా ఉంటుందో అన్న సందేహాలు వెంటాడాయి. కానీ సినిమా అంచ‌నాల‌ను మించిపోవ‌డంతో ఫుల్ పాజిటివ్ టాక్ వ‌చ్చింది. రివ్యూలు అదిరిపోయాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. యునాన‌మ‌స్ టాక్‌తో సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్లే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ధ‌నుష్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డం, నాగ్‌కు కూడా మంచి విజ‌యాన్నందించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.