కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదలకు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక కమల్ హసన్ బృందానికి కించిత్ ఆనందం కూడా లేదు. ఎందుకంటే తెలుగు తమిళంలో ఇప్పటికే డిజాస్టర్ టాక్ తో ఫైనల్ రన్ కు వచ్చేసిన ఈ సూపర్ ఫ్లాప్ ఇప్పటికిప్పుడు శాండల్ వుడ్ లో అద్భుతాలు చేసే ఛాన్స్ సున్నా. పైగా హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ నేనిప్పుడు రిలీజ్ చేయలేనని, పోటీ సినిమాలు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ ఎవరైనా ముందుకొస్తే తన అడ్వాన్సులు వెనక్కు ఇచ్చి ప్రొసీడ్ అవ్వొచ్చని చెప్పడంతో కథ కంచికి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇప్పటికే తమిళ వెర్షన్ కు సంబంధించిన హెచ్డి ప్రింట్లు ఆన్ లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటక రిలీజ్ ఆగిపోవడం వల్ల తమకు 30 కోట్ల నష్టం వాటిల్లిందని కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కుమార్ ఇంటర్నేషనల్ చెప్పినట్టుగా చెన్నై మీడియాలో వస్తున్న వార్తలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే విడుదల ఆగిపోయిన మాట నిజమే కానీ మరీ ఇంత వసూలు చేసే మ్యాటర్ థగ్ లైఫ్ లో లేదన్నది వాస్తవం. ఒకవేళ ఈ వివాదం లేకుండా సాఫీగా తమిళ, తెలుగు, హిందీతో పాటు కన్నడలో కూడా రిలీజై ఉంటే మహా అయితే పది కోట్ల లోపే గ్రాస్ వచ్చేదని ట్రేడ్ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ముప్పై కోట్ల నష్టం అనే ప్రశ్న ఉత్పన్నం కాదనేది వాళ్ళ వెర్షన్.
ఏది ఏమైనా ఇండియన్ 2ని మించిన డిజాస్టర్ మూటగట్టుకున్న కమల్ హాసన్ థగ్ లైఫ్ కోసం చేసిన ప్రమోషన్లు, పెట్టిన ఖర్చు, పబ్లిసిటీ కోసం తిరిగిన ఊళ్లు, శ్రమను మర్చి ఇచ్చిన పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఇప్పట్లో ఈ గాయం మానేలా లేదు. ఇంకో వైపు మణిరత్నం సైతం ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ ఆయనను ఎంతో కొంత ఫామ్ లోకి తిరిగి తీసుకొచ్చింది. కానీ థగ్ లైఫ్ పుణ్యమాని ఏకంగా ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇప్పుడు శింబు సోలో హీరోగా చేయబోయే సినిమాతో అయినా కంబ్యాక్ అవుతారో లేదో అనేది కాలమే సమాధానం చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates