ధనుష్ మూవీగా చూడటం లేదా

తమిళంలో ధనుష్ కున్న ఫాలోయింగ్ చిన్నదేమీ కాదు. సూర్య, విక్రమ్ లను దాటిపోయే స్థాయిలో ఇతని సినిమాలు చాలాసార్లు భారీ వసూళ్లు తీసుకొచ్చాయి. వడ చెన్నై, రఘువరన్ బిటెక్ (విఐపి), కర్ణన్, మారి ఆషామాషీ హిట్లు కాదు. మధ్యలో కొన్ని నిరాశపరిచినా మాస్ లో తనకున్న ఫాలోయింగ్ పెద్దదే. అయితే కుబేరకు మాత్రం ఆశ్చర్యకరంగా తమిళ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం అరవ ట్రేడ్ ని విస్మయపరుస్తోంది. నిజానికి అక్కడ టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత మళ్ళీ థియేటర్లను నింపిన సినిమా మరొకటి రాలేదు. అందుకే కుబేర మీద బోలెడు నమ్మకం పెట్టుకుని ఎదురు చూశారు. తెలుగు బుకింగ్స్ బాగున్నాయి.

దీనికి కారణాలు ఏంటయ్యా అంటే కుబేరను వాళ్ళు తెలుగు టు తమిళ్ డబ్ చేసిన మూవీగా భావిస్తున్నారట. ఈ డౌట్ వచ్చే ధనుష్ చెన్నైలో జరిగిన ఈవెంట్ లో రెండు వెర్షన్లు విడివిడిగా షూట్ చేశామని ప్రత్యేకంగా చెప్పాడు. అయినా సరే అక్కడి జనాలు నమ్మడం లేదు కాబోలు. ముఖ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ముల వాళ్లకు పరిచయం లేకపోవడం దీనికి కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా ఇవేవి తమిళంలో డబ్బింగ్ కాలేదు. నయనతారతో తీసిన కహాని రీమేక్ అనామిక డిజాస్టర్ కావడం వల్ల తన పేరు తమిళంలో రిజిస్టర్ కాలేకపోయింది. లేదంటే సీన్ వేరుగా ఉండేదేమో.

మనమేమో ఇక్కడ డబ్బింగ్, రీమేక్ అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు నెత్తిన బెట్టుకుంటున్నాం. అక్కడేమో మనది కాదు, ఇది తెలుగువాళ్ళు తీసిందంటూ ఏవేవో ఫీలింగ్స్ పెట్టుకుని ఇంటరెస్ట్ తగ్గించుకుంటున్నారు. అయినా సరే కుబేర టీమ్ మాత్రం ధీమాగా ఉంది. భాషతో సంబంధం లేకుండా ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇది అందరిని మెప్పిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ఓవర్సీస్ ఎర్లీ ప్రీమియర్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 నుంచే షోలు మొదలుకాబోతున్నాయి. తమిళనాడులో 9 నుంచి స్టార్ట్ అవుతాయి. సో టాక్, రివ్యూలు అందరికంటే ఆలస్యం చేరేది కోలీవుడ్ జనాలకే.