‘రాజాసాబ్’పై నెగెటివ్ క్యాంపైన్ చేసిందెవరు?

ఈ రోజు రిలీజైన ‘రాజా సాబ్’ టీజర్ ప్రభాస్ అభిమానులకు అమితానందాన్నిచ్చింది. ప్రభాస్‌ ‘బాహుబలి’ తర్వాత బెస్ట్ లుక్స్‌లో కనిపించింది ఈ చిత్రంలోనే అనడంలో సందేహం లేదు. పైగా అతను సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఫ్రేమ్ వావ్ అనిపించింది. ‘ఇండియాస్ బిగ్గెస్ట్ ఎవర్ హార్రర్ ఫాంటసీ’ అని చివర్లో వేసిన మాటకు న్యాయం చేసినట్లే కనిపించింది టీజర్. ఇప్పటికే ‘రాజా సాబ్’ మీద భారీ అంచనాలుండగా.. టీజర్ ఆ అంచనాలను ఇంకా పెంచిందనడంలో సందేహం లేదు. ఐతే ఇప్పుడు ఇంత క్రేజ్ తెచ్చుకున్న సినిమా.. ఆరంభమైనపుడు మాత్రం చాలా నెగెటివిటీని ఎదుర్కొంది. 

కనీసం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి కూడా మేకర్స్ భయపడ్డారు. మీడియాను పిలిచి ముహూర్త వేడుక కూడా నిర్వహించలేదు. అందుక్కారణం.. మారుతి చివరి చిత్రాలు పక్కా కమర్షియల్, మంచి రోజులు వచ్చాయి డిజాస్టర్లు కావడం, ప్రభాస్‌తో సినిమా చేసే స్థాయి అతడికి లేదని అభిమానులు భావించడం. ప్రభాస్, మారుతి కాంబోలో సినిమా అని వార్తలు వచ్చినపుడు సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు నెగెటివ్ ట్రెండ్ కూడా నడవడం గమనార్హం. ఐతే ఇది కేవలం అభిమానులు చేసింది కాదని.. దీని వెనుక ఒక నిర్మాత కూడా ఉన్నాడని అంటున్నాడు మారుతి మిత్రుడు ఎస్కేఎన్. 

‘రాజా సాబ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ఈ సినిమా మొదలైనపుడు ఒక నిర్మాత పనిగట్టుకుని నెగెటివ్ క్యాంపైన్ చేయించాడని చెప్పాడు. ఆయనతో సహా చాలామంది ఈ చిత్రాన్ని తక్కువ అంచనా వేశారని.. వాళ్లందరికీ సినిమా సమాధానం చెబుతుందని.. రికార్డులు బద్దలు కొడుతుందని.. ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుందని ఎస్కేఎన్ ధీమా వ్యక్తం చేశాడు.

అప్పుడు నెగెటివ్ క్యాంపైన్ చేసిన నిర్మాతే.. రిలీజ్ తర్వాత పాజిటివ్ ట్రెండ్ చేస్తాడని ఎస్కేఎన్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. మొగుడి కెపాసిటీ ఏంటో పెళ్లానికి తెలిసినట్లే.. స్నేహితుడి పొటెన్షియాలిటీ ఏంటో ఒక స్నేహితుడికే తెలుస్తుంది అంటూ పోలిక పెడుతూ.. 20 ఏళ్లకు పైగా తాను మారుతితో ట్రావెల్ చేస్తున్నానని.. అతను ‘రాజా సాబ్’తో చరిత్ర సృష్టిస్తాడని ఎస్కేఎన్ అన్నాడు. పది పదిహేనేళ్లుగా ప్రభాస్ అభిమానులు మిస్సయిన ‘రెబల్’ను ‘రాజా సాబ్’లో మారుతి బయటకు తీసుకువస్తాడని అన్నాడు.