=

స్టార్ హీరోలను పట్టేసిన కుర్ర డైరెక్టర్

కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా. స్టార్లు లేరు. మనకు శ్రీకాంత్ ఎలాగో కోలీవుడ్ లో శశికుమార్ అలాగా. అతనే ప్రధాన పాత్ర. హీరోయిన్ లేదు. భార్యగా సిమ్రాన్ మధ్యవయసు దాటిన తల్లిగా నటించింది. సూర్య రెట్రోకు పోటీగా మే 1 రిలీజయ్యింది. కట్ చేస్తే నాలుగు వారాలకే 90 కోట్ల వసూళ్లకు దగ్గర వెళ్ళిపోయి ట్రేడ్ ని విస్మయపరిచింది. నెల రోజులకే ఓటిటిలో వచ్చి ఇతర బాషల డబ్బింగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సింపుల్ కథని అందమైన ఎమోషన్స్ జోడించి, సరదాగా నవ్విస్తూ, అక్కడక్కడా ఏడిపిస్తూ దర్శకుడు అబిషన్ జీవింత్ తీర్చిదిద్దిన విధానం దాన్ని బ్లాక్ బస్టర్ గా మార్చింది.

ఇంతా చేసి ఇతని వయసు పాతికేళ్లే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం ఇతను ఆఫర్లతో తలమునకలవుతున్నాడు. ధనుష్ ఆల్రెడీ ఒక ప్రాజెక్టుకు లాక్ చేసుకోగా సూర్య బ్యానర్ నుంచి మరో అడ్వాన్స్ వచ్చిందని చెన్నై రిపోర్ట్. ఈ ఇద్దరూ ఇతని దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం జీవింత్ కథలు రాసే పనిలో ఉన్నాడు. ముందు ధనుష్ ది మొదలు కానుంది. కాకపోతే టైం పట్టేలా ఉంది.. కంటెంట్  ఉంటే చిన్నా పెద్ద తేడా లేకుండా ఎలాంటి సినిమా అయినా ఆదరణ దక్కించుకుంటుందని చెప్పడానికి టూరిస్ట్ ఫ్యామిలీనే మంచి ఉదాహరణ. తెలుగులోనూ ఇలాంటి ప్రయత్నాలు జరగాలి.

సోషల్ మీడియా స్పందన చూస్తే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా టూరిస్ట్ ఫ్యామిలీ అందరినీ ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో తమిళ వెర్షనే నెల రోజులకు పైగా ఆడటం దీని విజయానికి మరో కొలమానం. శ్రీలంక నుంచి వలస వచ్చిన ఒక కుటుంబం చెన్నైలోని ఒక కాలనీలో తల దాచుకుంటుంది. ముందు నిజం తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చిన అక్కడి జనాలు తర్వాత వీళ్ళ మంచితనం అర్థం చేసుకుని పోలీసులకు దొరకనివ్వకుండా స్వంత వాళ్ళుగా కాపాడుకుంటారు. హాస్యం, భావోద్వేగం సమపాళ్ళలో కుదిరిన ఈ ఎంటర్ టైనర్ దర్శకధీర రాజమౌళిని సైతం మెప్పించింది.