కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్లు కొట్టినా.. ఆ తర్వాత అరడజను ఫ్లాపులిచ్చినా మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్కే చెల్లింది. ఇక అతడి పనైపోయిందనుకున్న దశలో ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలతో గత ఏడాది బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అతడికి హ్యాట్రిక్ సినిమా అవుతుందని అంచనాలున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’.
ఆకర్షణీయమైన టైటిల్, కాన్సెప్టుతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు సుబ్బు రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతున్నట్లు మూడు నెలల కిందటే సమాచారం బయటికి వచ్చింది. ఆ తర్వాత జీ5 వాళ్లతో డీల్ అయిపోయిందని, అతి త్వరలోనే రిలీజ్ అని అన్నారు. పే పర్ వ్యూ పద్ధతిలో సినిమా విడుదల చేయబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి.
ఈ మధ్యే ‘సోలో బ్రతుకే సో బెటర్’కు సెన్సార్ కూడా పూర్తయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ‘కమింగ్ సూన్’ అని కూడా వేశారు. కానీ ఆ తర్వాత చప్పుడు లేదు. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు కానీ.. ఇప్పుడు సైలెంటుగా ఉన్నారు. రాబోయే కొన్ని వారాల్లో సినిమా రిలీజయ్యే సంకేతాలే కనిపించడం లేదు. అసలు ఈ సినిమాకు ఓటీటీ డీల్ అయ్యిందా లేదా అని సందేహాలు కలుగుతున్నాయి ఈ మధ్య. ఈ చిత్రం క్రిస్మస్ టైంలో థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలున్నట్లు కూడా మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిర్మాత ఆశించిన రేటు రాకపోవడంతో ఓటీటీ డీల్ ఏమైనా క్యాన్సిల్ చేశారా అన్న చర్చ నడుస్తోంది. ఈ ప్రచారాల్లో ఏది నిజమో తెలియదు కానీ.. ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో దాని చుట్టూ ఉన్న బజ్ అయితే తగ్గిపోతున్న మాట వాస్తవం.