ఓటీటీ సినిమా అంటేనే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చేస్తోంది. ఎప్పుడో ఒక సినిమా పర్వాలేదనో, బాగుందనో అనిపించడం తప్పితే మిగతా సినిమాలన్నీ చేదు అనుభవాలనే మిగులుస్తున్నాయి. ఈ కోవలో కొత్తగా చేరిన సినిమా ‘మిస్ ఇండియా’. ప్రేక్షకులను నిరాశకు గురి చేయడంలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నింటినీ మించిపోయిందీ చిత్రం.
తెలుగులో రిలీజైన ఓటీటీ సినిమాలన్నింట్లోకి అత్యంత అసహనానికి గురి చేసిన సినిమాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. ‘మహానటి’ తర్వాత కీర్తి నుంచి ఇంత పేలవమైన సినిమా వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. టీవీ సీరియల్ తరహాలో మొదలై.. ఒక దశ దాటాక టీవీ సీరియలే నయం అనిపించేలా సాగింది ‘మిస్ ఇండియా’. ఇంత నాటకీయత, కృత్రిమత్వం ఉన్న సినిమాను కీర్తి ఎలా ఒప్పుకుందో అర్థం కావడం లేదు.
‘మిస్ ఇండియా’ థియేటర్లలో కనుక రిలీజై ఉంటే తొలి రోజు సాయంత్రానికి థియేటర్లు ఖాళీ అయిపోయేవి. ఆ తర్వాత థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా వచ్చేవి కావు. ఓటీటీలో కాబట్టి సబ్స్క్రిప్షన్ ఉన్నోళ్లు సినిమా చూస్తారు. నచ్చకుంటే మధ్యలోనే ఆపేస్తారు. కానీ టికెట్ కొని ఇలాంటి సినిమాను థియేటర్లో చూస్తే మాత్రం ఫ్రస్టేషన్ మామూలుగా ఉండదు. పనిగట్టుకుని ఇతరులకు చెప్పి మరీ సినిమాకు వెళ్లకుండా ఆపేస్తారు. కాబట్టి ఇలాంటి సినిమా థియేటర్లలో వచ్చి ఉంటే ఫలితం దారుణంగా ఉండేది.
డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోయి ఉండేవాళ్లు. ఈ చిత్రం అనే కాదు.. వి, నిశ్శబ్దం, పెంగ్విన్, 47 డేస్.. ఈ ఓటీటీ సినిమాల్లో ఏది థియేటర్లలో వచ్చి ఉన్నా డిజాస్టర్లే అయ్యేవి. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఘోరంగానే ఉండేది. కాస్త పర్వాలేదనిపించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సైతం థియేటర్లలో అయితే ఆ మాత్రం స్పందన కూడా తెచ్చుకునేది కాదు. కాబట్టి ఈ సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజై సేఫ్ అయిపోయినట్లే భావించాలి.