బాంబు తీసి ప‌క్క‌న పెట్టేసిన అక్ష‌య్ కుమార్‌

బాలీవుడ్లో వివాదాల‌కు దూరంగా ఉంటూ అంద‌రి వాడిగా గుర్తింపు తెచ్చుకుని, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ముందుండే అక్ష‌య్ కుమార్.. త‌న కొత్త సినిమా విష‌యంలో అనుకోని వివాదాన్ని ఎదుర్కొన్నాడు. అత‌ను ప్ర‌ధాన పాత్ర‌లో రాఘ‌వ లారెన్స్ రూపొందించిన కాంఛ‌న రీమేక్‌కు ల‌క్ష్మీబాంబ్ అని టైటిల్ పెట్ట‌డంపై ఇటీవ‌లే ఓ వ‌ర్గం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది.

ఈ సినిమాలో హీరో ముస్లిం, హీరోయిన్ హిందువు కాగా.. ల‌వ్ జిహాద్‌ను ప్రోత్స‌హించేందుకే ఇలా పెట్టార‌ని ఆ వ‌ర్గం ఆరోపించింది. అలాగే ల‌క్ష్మీబాంబ్ అని పేరు పెట్ట‌డం ద్వారా హిందూ దేవ‌త ల‌క్ష్మిని అవ‌మానించార‌ని, దీపావ‌ళి కానుక‌గా సినిమాను రిలీజ్ చేస్తూ ఇదేం తీర‌ని వాళ్లు గొడ‌వ చేశారు.

ల‌క్ష్మీబాంబ్ సినిమాను బ‌హిష్క‌రించాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పిలుపు కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో భ‌య‌ప‌డ్డ చిత్ర బృందం.. టైటిల్ మార్చేయాల‌ని నిర్ణ‌యించింది. బాంబ్ తీసేసి కేవ‌లం ల‌క్ష్మి అనే పేరును సినిమాకు ఖ‌రారు చేసింది. ఇంత‌కుముందు ప‌ద్మావ‌తి సినిమా విష‌యంలో గొడ‌వ‌లు జ‌రిగితే రిలీజ్ ముంగిట ఆ టైటిల్‌ను ప‌ద్మావ‌త్‌గా మార్చిన సంగ‌తి తెలిసిందే.

తెలుగులో సైతం వాల్మీకి టైటిల్ విష‌యంలో అభ్యంత‌రాలు వ్య‌క్తం కాగా.. విడుద‌ల‌కు ముందు రోజు దాన్ని గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా మార్చారు. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌రు 9న హాట్ స్టార్‌లో ల‌క్ష్మి విడుద‌ల కాబోతోంది. ఇందులో అక్ష‌య్ స‌ర‌స‌న కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టించింది.