రాజశేఖర్ ఔట్ ఆఫ్ డేంజర్


కరోనాకు చిన్నా పెద్దా, రాజు పేద అనే తేడాలేమీ లేవని పలుమార్లు రుజువైంది. డబ్బుకు లోటు లేని, అత్యుత్తమ వైద్య సదుపాయం పొందగల ఉన్నత స్థాయి వ్యక్తులు కరోనా ధాటికి నిలవలేకపోయారు. ప్రాణాలు కోల్పోయారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా ధాటికి మృత్యు వాత పడ్డారు. గత నెలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాకు బలయ్యారు. ఇటీవలే మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి, ఆయన భార్య సైతం కరోనాతోనే ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరో రాజశేఖర్ కరోనాతో పోరాడుతున్నారని, ఆయన్ని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారని వార్తలు రాగానే అభిమానులు కంగారు పడిపోయారు. ఆయనకు ఏమీ కాకూడదని ప్రార్థనలు చేశారు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఆ ప్రార్థనలు ఫలించినట్లే ఉన్నాయి.

రాజశేఖర్‌ ఔట్ ఆఫ్ డేంజర్ అన్నది ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆయన ఇంకో రెండు రోజుల్లో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు వచ్చే అవకాశాలున్నట్లు రాజశేఖర్ సతీమణి జీవిత వెల్లడించారు. ఆయన వేగంగా కోలుకుంటున్నారని.. రోజు రోజుకూ ఆరోగ్యం మెరుగు పడుతోందని ఆమె చెప్పారు. రాజశేఖర్ ఒంట్లో అన్ని ఇన్ఫెక్షన్లూ తగ్గినట్లే అని కూడా ఆమె వెల్లడించారు. కొన్ని పరీక్షల తర్వాత రెండు రోజుల్లో ఐసీయూ నుంచి రాజశేఖర్‌ను బయటికి పంపే అవకాశాలున్నట్లు ఆమె వెల్లడించారు.

కొన్ని వారాల కిందట రాజశేఖర్, జీవితలతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లూ కరోనా బారిన పడ్డారు. ముందుగా కూతుళ్లిద్దరూ కరోనా నుంచి కోలుకోగా.. రాజశేఖర్, జీవిత ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందారు. జీవిత కొన్ని రోజుల కిందటే కరోనా నుంచి కోలుకున్నారు. రాజశేఖర్ పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే కనిపించింది. ఇప్పుడు ఆయన కూడా కోలుకుంటున్నారన్న వార్త అభిమానులకు ఉపశమనమే.