ఇర్ఫాన్‌పై గౌర‌వంతో ఆగిపోయిన చిరు

ఏప్రిల్ 29.. అంత‌ర్జాతీయ నృత్య దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ఉద‌యం నుంచి ట్విట్ట‌ర్ డ్యాన్స్ వీడియోల‌తో మోతెక్కిపోతోంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు వ‌ర‌కు డ్యాన్సింగ్ గాడ్ అంటే మెగాస్టార్ చిరంజీవే. ఆయ‌న డ్యాన్సులు ఏ రేంజిలో అల‌రించాయో.. ఎలా సినిమా విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాయో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

ఇండియాలోనే అత్యుత్త‌మ డ్యాన్స‌ర్ల‌లో ఒక‌డైన చిరుకు సంబంధించి అనేక వీడియోలు ట్విట్ట‌ర్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ నృత్యంపై త‌న‌కున్న ప్ర‌త్యేక అభిరుచి నేప‌థ్యంలో ఇప్ప‌టిదాకా ఎవ‌రూ చూడ‌ని డ్యాన్స్ వీడియోలు కొన్ని వ‌ర‌ల్డ్ డ్యాన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఈ రోజు ఉద‌యం చిరు ఓ వీడియో ద్వారా ప్ర‌క‌టించాడు.

కానీ త‌ర్వాత ఈ ఆలోచ‌న‌ను చిరు విర‌మించుకున్నాడు. అందుక్కార‌ణం ఇర్ఫాన్ ఖాన్ మ‌ర‌ణం. ఏడాదిన్న‌ర‌గా క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఈ లెజెండ‌రీ బాలీవుడ్ న‌టుడు ముంబ‌యిలోని కోకిలా బెన్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం మ‌ర‌ణించాడు. చిరు ఈ ఉద‌యం డ్యాన్స్ వీడియోల గురించి ప్ర‌క‌ట‌న చేసే స‌మ‌యానికి ఇర్ఫాన్ మ‌ర‌ణ వార్త ఆయ‌న‌కు తెలియ‌లేదు. త‌ర్వాత స‌మాచారం అందుకున్న చిరు.. ఇర్ఫాన్‌కు నివాళి అర్పించాడు.

త‌ర్వాత ఈ విషాద స‌మ‌యంలో ఇర్ఫాన్ గౌర‌వార్థం తాను అభిమానుల‌కు హామీ ఇచ్చిన డ్యాన్స్ వీడియోల‌ను పోస్ట్ చేయ‌ట్లేద‌ని ప్ర‌క‌టించాడు. ఇది ఫ్యాన్స్‌కు ఒకింత నిరాశ క‌లిగించే విష‌య‌మే అయినా.. భార‌తీయ సినీ ప‌రిశ్రమ ఒక దిగ్గ‌జాన్ని కోల్పోయిన స‌మ‌యంలో ఈ డ్యాన్స్ వీడియోల‌తో సంబ‌రాలు చేసుకోవ‌డానికిది మంచి సంద‌ర్భం కాద‌ని అర్థం చేసుకోవాల్సిందే.