బాలయ్యను పట్టించుకోరేంటయ్యా

టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ఒకటి. ఐతే ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఆయన అందరివాడుగా ఉండేవాడు. కానీ తర్వాతి తరం మాత్రం ఇండస్ట్రీలో మిగతా వాళ్లతో అంత సన్నిహితంగా మెలగలేపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. తాను వేరు, ఇండస్ట్రీలో మిగతా వాళ్లు వేరు అన్నట్లుగా తన దారిలో తాను వెళ్లిపోతూ ఉంటాడు. చిరంజీవి లాంటి కొందరు తనకు క్లోజ్ అని బాలయ్య చెబుతాడు కానీ.. నిజానికి అంత సన్నిహితంగా కనిపించిన సందర్భాలు అరుదు.

ఇంతకుముందైనా బాలయ్య ఇండస్ట్రీ జనాలతో అంతో ఇంతో కలిసేవాడు. కానీ ఈ మధ్య పూర్తిగా అందరితోనూ సంబంధాలు తెగిపోయాయా అన్నట్లు కనిపిస్తున్నాయి పరిణామాలు. ఈ మధ్య కరోనా టైంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దల్ని సినీ ప్రముఖులు కలిసినపుడు తనను పిలవకపోవడంపై బాలయ్య అలిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఈ దెబ్బతో ఇండస్ట్రీకి, బాలయ్యకు మధ్య అంతరం మరింత పెరిగినట్లే ఉంది. తాజాగా బాలయ్య మధ్యలో ఆగిపోయిన తన కలల ప్రాజెక్టు ‘నర్తనశాల’ కోసం దశాబ్దంన్నర కిందట తెరకెక్కించిన సన్నివేశాలకు కొన్ని విశేషాలు జోడించి శ్రేయాస్ ఈటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పూర్తి స్థాయి సినిమా కాకపోయినా బాలయ్యకు ప్రతిష్టాత్మకమైందే. ఆయన దర్శకత్వం వహించిన సినిమా నుంచి ఫుటేజీ తీసి ఇలా దసరా సందర్భాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేస్తే సినీ పరిశ్రమ నుంచి కనీస స్పందన లేదు.

దీన్ని ఇండస్ట్రీ జనాలెవ్వరూ ఎండోర్స్ చేయలేదు. దాని మీద ఒక కామెంట్ చేయలేదు. శుభాకాంక్షలు లేవు. అభినందనలు లేవు. అసలెవ్వరూ దీని ఊసే ఎత్తట్లేదు. నారా రోహిత్ ఒక్కడు ఒక ట్వీట్ వేశాడు తప్పితే జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించలేదు. బాలయ్య తోటి సీనియర్లకూ ఇది పట్టలేదు. బాలయ్యతో వ్యవహారమే మనకొద్దు అన్నట్లుగా అందరూ గప్‌చుప్ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.