అనిరుధ్ కోసం దర్శకుల పడిగాపులు

సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు ప్రాజెక్టులు ఏవైనా క్రేజీవి వస్తే వద్దనడం లేదు. దీని వల్ల సకాలంలో వర్క్ చేయించుకోలేకపోతున్న ఇబ్బంది టాలీవుడ్ దర్శకుల్లో కనిపిస్తోంది. నాని ది ప్యారడైజ్ లాంచింగ్ ప్రోమోని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడు.

వయొలెంట్ విజువల్స్ అదిరిపోయాయట. దీనికి బెస్ట్ స్కోర్ కావాలి. కానీ అనిరుధ్ మీద ఒత్తిడి చేయలేని పరిస్థితి. అందుకే టీమ్ ఓపిగ్గా ఎదురు చూస్తోంది. అతను కంపోజ్ చేసి ఫైనల్ అయ్యాకే డేట్ ప్రకటిస్తారు. అప్పటిదాకా వెయిటింగే.

విజయ్ దేవరకొండ 12ది ఇదే సీన్. గౌతమ్ తిన్ననూరితో అనిరుధ్ కు మంచి బాండింగ్ ఉంది. అయినా సరే టైట్ షెడ్యూల్స్ వల్ల అనుకున్న టైంకి అనిరుద్ అవుట్ ఫుట్ ఇవ్వలేకపొతున్నాడు. లేకపోతే ఈ పాటికి టైటిల్ టీజర్ వచ్చేసి ఉండాలి.

ఇదే కాంబోలో తెరకెక్కించిన మేజిక్ సైతం డోలాయమానంలో ఉంది. చిన్న ప్రోమోలకే ఇంత ఒత్తిడి చవి చూస్తే ఇక సినిమా అయ్యాక రీ రికార్డింగ్ కోసం పెద్ద సర్కస్ చేయాల్సి వచ్చేలా ఉంది. అయితే జైలర్ 2 అనౌన్స్ మెంట్ వీడియోలో నటించి మరీ దానికి పని చేసిన అనిరుధ్ తెలుగు సినిమాలకు మాత్రం జాప్యం చేయడం అంతుచిక్కని భేతాళ ప్రశ్న.

దేవరలో తన పనితనం చూశాక ఎంతైనా వేచి చూసే ధోరణిలో దర్శకులున్నారు. బాలకృష్ణ – గోపిచంద్ మలినేని, చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమాలకు కూడా తననే అడుగుతున్నారు కానీ ఇంకా ఎస్ చెప్పలేదని టాక్. వీటికి వర్క్ చేయాలని ఉందని, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని వాటి నిర్మాతలతో అన్నాడట.

కాకపోతే కమిట్ మెంట్ కోసం కొంచెం సమయం అడిగాడని వినికిడి. ఈ క్రేజీ కాంబోలకు అనిరుధ్ కనక సంగీతమిస్తే రజినీకాంత్ కు దక్కినట్టు చిరు, బాలయ్యలకు అద్భుతమైన ఎలివేషన్ దక్కుతుంది. పైన చెప్పినవి కాకుండా తను కూలి, జన నాయగన్, ఎల్ఐసి, ఇండియన్ 3, జైలర్ 2, శివ కార్తికేయన్ 23కి లాకయ్యాడు.