మైత్రీ తో సినిమా తీయ్.. బాలీవుడ్‌లో పాగా వెయ్!

తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ వెళ్లి హిందీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత కూడా పూరి జగన్నాథ్ లాంటి కొందరు డైరెక్టర్లు అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో సందీప్ రెడ్డి వేసిన ఇంపాక్ట్ గురించి తెలిసిందే.

ఇక త్వరలోనే గోపీచంద్ మలినేని తొలి హిందీ చిత్రం విడుదల కాబోతోంది. సీనియర్ హీరోగా సన్నీ డియోల్ లీడ్ రోల్‌లో ఆయన రూపొందించిన ‘జాట్’ ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నిర్మిస్తున్నది టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్సే కావడం విశేషం. ఆ సంస్థలోనే గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’ తీశాడు. తర్వాత అతడికి బాలీవుడ్ ప్రాజెక్ట్ సెట్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు మైత్రీ సంస్థ మరో దర్శకుడిని బాలీవుడ్‌కు తీసుకెళ్లే పనిలో ఉన్నట్లు సమాచారం.

గోపీతో ‘వీరసింహారెడ్డి’ చేస్తున్నపుడే.. బాబీ కొల్లితో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది మైత్రీ సంస్థ. రెండు చిత్రాలూ మంచి ఫలితాలందుకున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ.. ‘డాకు మహారాజ్’ చేశాడు. అదీ సక్సెస్ అయింది. ఇప్పుడు బాబీని హిందీకి తీసుకెళ్లే ప్రయత్నంలో మైత్రీ సంస్థ ఉందట. అతడితో ఇందుకోసం ఒక స్క్రిప్టు రెడీ చేయిస్తోందట.

ఆ పని పూర్తయ్యాక ఆ కథకు తగ్గ హీరోతో బాలీవుడ్లో మరో భారీ చిత్రం చేయాలని మైత్రీ సంస్థ చూస్తోంది. బాబీకి వెంటనే తెలుగులో అయితే ఏ కమిట్మెంట్ లేదని తెలుస్తోంది. ఉన్నా.. దాన్ని వాయిదా వేయించి హిందీ సినిమానే చేయించబోతోందట మైత్రీ సంస్థ. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’ రిలీజ్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న బాబీ.. ప్రస్తుతం తన రైటింగ్ టీంతో కలిసి స్క్రిప్టు పనిలో ఉన్నట్లు సమాచారం.