చిరంజీవి ఎందుకిలా చేస్తున్నాడు?

మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల కిందట తిరిగి సినిమాల్లోకి రావడం అభిమానులకు అమితానందాన్ని కలిగించిన విషయం. రాజకీయాల్లోకి వెళ్లాక తిరిగి సినిమాల్లోకి వచ్చేదే లేదని తెగేసి చెప్పిన ఆయన.. ఆ రంగంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడంతో తిరిగి తనకెంతో ఇష్టమైన రంగానికి వచ్చేశారు. ఐతే రీఎంట్రీ కోసం ఆయన ఎంచుకున్న సినిమా చాలామందికి నచ్చలేదు.

స్ట్రెయిట్ మూవీ కాకుండా.. తమిళ ‘కత్తి’ని రీమేక్ చేయడం వల్ల చిరు ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు, ఎలా సర్ప్రైజ్ చేస్తాడు అనే ఆసక్తి లేకపోయింది. అయినా సరే.. చిరు రీఎంట్రీ మూవీ కాబట్టి దాన్ని బాగానే ఆదరించారు ప్రేక్షకులు. ఆ తర్వాత ‘సైరా’తో అభిమానులను అలరించాడు చిరు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ మీదా భారీగానే అంచనాలున్నాయి.

ఐతే మిగతా హీరోలు లాక్ డౌన్ టైంలో కొత్తగా ఎగ్జైటింగ్ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటే చిరు మాత్రం వరుసబెట్టి మళ్లీ రీమేక్‌ల మీద పడటం చాలామందికి మింగుడు పడటం లేదు. ఆల్రెడీ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ఓకే చేసిన చిరు.. వి.వి.వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్ కోసం కూడా రంగం సిద్ధం చేశారు. ఈ రెండూ రొటీన్ మాస్ మసాలా సినిమాలు. పైగా దాన్ని డీల్ చేస్తున్న డైరెక్టర్లు ఔట్ డేట్ అయిపోయారు. గత కొన్నేళ్లలో భాషల మధ్య హద్దులు చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో మామూలుగానే రీమేక్‌లంటే ఆసక్తి ఉండట్లేదు. పైగా చిరు ఎంచుకుంటున్నది రొటీన్ సినిమాలు కావడం నిరాశ కలిగించే విషయం.

ఉన్న రెండు రీమేక్‌లు సరిపోవని ఇప్పుడు అజిత్ నటించిన తమిళ హిట్ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ మీద చిరు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కొత్త వార్త బయటికి వచ్చింది. ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో అనువాదమైంది. ఓ మోస్తరుగా ఆడింది కూడా. ‘లూసిఫర్’ లాగా వచ్చింది వెళ్లింది తెలియని సినిమా కాదిది. తెలుగులో రిలీజై, ఓటీటీలో అందుబాటులో ఉన్న, పాత సినిమాను రీమేక్ చేయడానికి చిరుకు ఇంత ఆసక్తి ఏంటో మరి?