టాలీవుడ్లో సంక్రాంతికి ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసిన స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. గతంలో ఈ పండక్కి ఆయన చరిత్రలో నిలిచిపోయే సినిమాలను అందించారు. తర్వాతి తరం హీరోల ఆధిపత్యం మొదలయ్యాక కూడా వెంకీ అప్పుడప్పుడూ సంక్రాంతికి సినిమాలు వదులుతూనే ఉన్నారు. 2019లో ఆయన సినిమా ‘ఎఫ్-2’ సెన్సేషనల్ హిట్ అయింది. ఆ తర్వాత వెంకీ మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచింది గత ఏడాది ‘సైంధవ్’ మూవీతోనే.
‘హిట్’ సిరీస్‌తో మంచి పేరు సంపాదించిన శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ముందు ఈ మూవీ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించింది. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి హైప్ తగ్గిపోయింది. ఇక బ్యాడ్ టాక్ వచ్చేసరికి సినిమా బాక్సాఫీస్ దగ్గర అస్సలు నిలబడలేకపోయింది. ఫుల్ రన్లో ‘సైంధవ్’ ఏడెనిమిది కోట్లకు మించి షేర్ రాబట్టలేకపోయింది. కానీ ఏడాది తిరిగేసరికి విక్టరీ వెంకటేష్ దశ తిరిగిపోయింది.
ఈ సంక్రాంతికి రిలీజైన వెంకీ కొత్త చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది.అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే తిరుగులేని జోరు చూపించిన ఈ చిత్రం.. తొలి రోజు అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది రూ.40 కోట్లకు పైగా గ్రాస్, రూ.25 కోట్ల మేర షేర్ రాబట్టింది. ‘సైంధవ్’ సినిమా ఫుల్ రన్లో సాధించిన షేర్‌తో పోలిస్తే కేవలం ఒక్క రోజులోనే మూడు రెట్ల షేర్ రాబట్టిందంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏ రేంజ్ సక్సెస్ అన్నది అర్థం చేసుకోవచ్చు.
దీన్ని బట్టే వెంకీకి ఎలాంటి సినిమాలు బాగా సూటవుతాయన్నది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఆయన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో చూడ్డానికే ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ‘ఎఫ్-2’కు సైతం భారీ విజయాన్ని అందించారు ప్రేక్షకులు. కాబట్టి వెంకీ మిగతా జానర్ల కంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో నటించడానికే మొగ్గు చూపితే బెటర్.
గతంలో కూడా ‘కలిసుందాం రా’ సహా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో వెంకీ ఘనవిజయాలు అందుకున్నారు. కాబట్టి ఇక ముందూ కుటుంబ కథా చిత్రాలకే ఆయన ప్రాధాన్యం ఇవ్వడం ఖాయం.