రావిపూడినా మజాకా!

టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్‌కు రాకపోవడం వల్ల సెట్స్‌లోకి వచ్చాక ఇబ్బంది పడుతుంటారు. వర్కింగ్ డేస్ పెంచేస్తుంటారు. దీని వల్ల బడ్జెట్ పెరిగిపోయి నిర్మాతలు చిక్కుల్లో పడుతుంటారు.

స్టార్ డైరెక్టర్లలో చాలామందిది ఇదే వరస. ఐతే కొద్ది మంది మాత్రం పక్కా ప్లానింగ్‌లో రంగంలోకి దిగి శర వేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అలాంటి దర్శకులు పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా చెబుతుంటారు. కొత్త తరంలో అనిల్ రావిపూడిది కూడా ఇదే స్టైల్. స్క్రిప్టు పక్కాగా రెడీ చేసుకుని సెట్స్‌లో అడుగు పెట్టే అతను.. చకచకా సినిమాను పూర్తి చేసేస్తుంటారు.

రావిపూడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ఎఫ్-2’ను అతను 74 రోజుల్లోనే పూర్తి చేసేశాడు. ఇప్పుడు వెంకటేష్ హీరోగా తీసిన కొత్త చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ను 72 రోజుల్లోనే అవగొట్టేశాడట అనిల్. ఇదంతా పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగడ వల్లే సాధ్యమైందని ఓ ఇంటర్వ్యూలో అతను చెప్పాడు.

‘‘మామూలుగా సినిమా షూట్ అయ్యాక ఎడిటింగ్ చేస్తుంటాం. కానీ మేం స్క్రిప్టు దశలోనే ఎడిటింగ్ కూడా చేసేశాం. అవసరం లేని సన్నివేశాలన్నీ తీసి పక్కన పెట్టేశాం. ఒక సన్నివేశం మూడు నిమిషాలు అనుకుంటే మూడు నిమిషాల్లోనే తీశాం. ఇలా పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగడం వల్ల ‘ఎఫ్-2’ కంటే వేగంగా, 72 రెండు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

మేం షూటింగ్ పూర్తి చేశాక రన్ టైం 2 గంటల 26 నిమిషాలు వచ్చింది. అందులో కేవలం 4 నిమిషాలు మాత్రమే ఎడిట్ చేసి 2 గంటల 22 నిమిషాల రన్ టైంతో సెన్సార్‌కు పంపాం. ముందే సరైన ప్లానింగ్ జరగడం వల్ల వర్కింగ్ డేస్, బడ్జెట్ చాలా వరకు సేవ్ అయ్యాయి’’ అని అనిల్ తెలిపాడు.