నిశ్శ‌బ్దం ఫ్లాష్ బ్యాక్ బాలేద‌ని మాధ‌వ‌న్‌తో అంటే..

తెలుగు ప్రేక్ష‌కులు మంచి అంచ‌నాలు పెట్టుకున్న సినిమా నిశ్శ‌బ్దం. కానీ ఆ చిత్రం ఆ అంచ‌నాల్ని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ నెల 2న అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన నిశ్శ‌బ్దం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక‌పోయిన విష‌యం మాధ‌వ‌న్ పాత్ర‌ను సైకోలా చూపించ‌డం. ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ప్రేక్ష‌కుల‌కు ఎంత‌మాత్రం క‌న్విన్సింగ్‌గా అనిపించ‌లేదు.

ఈ విష‌యంలో పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. తాజాగా మాధ‌వ‌న్ ట్విట్ట‌ర్లో అభిమానుల‌తో చిట్ చాట్ చేయ‌గా.. ఒక నెటిజ‌న్ దాని గురించి ప్ర‌స్తావించాడు. సినిమాలో ఆంటోనీ పాత్ర‌కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ క‌న్విన్సింగ్‌గా లేద‌ని, దీనిపై మీరేమంటార‌ని అడిగాడు.

దీనికి మాధ‌వ‌న్ బ‌దులిస్తూ.. ఇప్పుడు నేను కేవ‌లం క్ష‌మాప‌ణ మాత్ర‌మే చెప్ప‌గ‌ను అన్నాడు. నిశ్శ‌బ్దం క‌థ న‌చ్చి చేశారా, ఈ సినిమాలో న‌టించాల‌ని న‌టించారా అని అడిగితే.. కొన్నిసార్లు సినిమాలు ఆడ‌తాయి, కొన్నిసార్లు ఆడ‌వు.. మా వంతు కృషి మేం చేశాం అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా స‌మాధానం ఇచ్చాడు మాధ‌వ‌న్.

నిశ్శ‌బ్దం సినిమా విడుద‌ల కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి రావ‌డం చికాకు పెట్టింద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పాడు మాధ‌వ‌న్. తెలుగులో చేస్తున్న డైరెక్ట్ సినిమాల్లో నెగెటివ్ రోల్సే ఎందుకు చేస్తున్నార‌ని అడిగితే.. ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న ఓ తెలుగు సినిమాలో పాజిటివ్ రోల్‌లో చూడ‌బోతున్నారని బ‌దులిచ్చాడత‌ను. త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రాకెట్రీ సినిమా కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న‌ట్లు మాధ‌వ‌న్ చెప్పాడు.