మొదటి రోజే అన్ని కోట్లా? : చైనాలో మహారాజ సునామీ

విజయ్ సేతుపతి సుడి బ్రహ్మాండంగా ఉంది. చైనా దేశంలో తన సినిమా రిలీజ్ అవ్వడమే గొప్పనుకుంటే మహారాజ ఏకంగా 40 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలై మొదటి రోజే 16 కోట్లకు పైగా వసూలు నమోదు చేయడం చూస్తే షాకనే మాట చిన్నదే అనిపిస్తుంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ రివెంజ్ డ్రామాకు అక్కడి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చైనాలో సుమారుగా 85 వేల స్క్రీన్లున్నాయి. వాటిలో సగానికి పైగా ఒక తమిళ చిత్రం ప్రదర్శించడం గొప్పయితే ఏకంగా వాళ్లకు బ్రహ్మాండంగా నచ్చేయడం అసలు విషయం. లాంగ్ రన్ ఖాయమని అక్కడి బిజినెస్ వర్గాల టాక్.

వేరే ఇతర విశేషాలు ఉన్నాయి. చైనీస్ సినిమాలను రివ్యూ చేసే డౌబన్ అనే వెబ్ సైట్ 8.7 / 10 రేటింగ్ ఇచ్చి గత కొన్నేళ్లలో హయ్యెస్ట్ రేటింగ్ దక్కించుకున్న ఇండియన్ మూవీగా పొగడ్తల వర్షం కురిపించింది. ఈస్ట్రన్ లడాఖ్ కు సంబంధించిన సరిహద్దు వివాదం రెండు దేశాల మధ్య అగాధం సృష్టించాక కొంత కాలం పాటు చైనాలో భారతీయ సినిమాలు రిలీజ్ కావడం లేదు. నాలుగేళ్లుగా నలుగుతున్న బోర్డర్ కాంట్రావర్సికి మన ప్రధాని నరేంద్రమోడీ, చైనా పీఎం ఎలెవన్ జింగ్ పాంగ్ రష్యా వేదికగా సామరస్య ఒప్పందానికి వచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు. దాని తర్వాత వచ్చిన మొదటి ఇండియన్ మూవీ మహారాజ.

హాలీవుడ్ నుంచి వచ్చిన గ్లాడియేటర్ 2 నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ మహారాజ ఇంత స్ట్రాంగ్ గా నిలవడం విశేషం. చెత్తబుట్ట పోయిందని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చే ఒక మాములు మనిషి తాను దత్తత తీసుకన్న కూతురి మీద అఘాయిత్యం జరిగితే దానికి ప్రతీకారం తీర్చుకునే తీరు తెరమీద అద్భుతంగా పండింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. ఇప్పుడు చైనాలోనూ అదే దూకుడు చూపించడం గమనిస్తే యునివర్సల్ గా ఇదెంత గొప్ప సబ్జెక్టో అర్థమవుతుంది. త్వరలో జపాన్ లోనూ మహారాజను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.