ఇదేంటి భాస్కర్…ఓటిటిలో వచ్చినా స్పీడ్ తగ్గలేదు!

థియేటర్లలో రిలీజైన ఒక సినిమా ఎంత హిట్టయినా రెండు వారాలు బలంగా ఆడితే చాలని నిర్మాతలు అనుకుంటున్న ట్రెండ్ ఇది. బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు అందుకుంటారు. అలాంటిది ఓటిటిలో వచ్చాక టికెట్లు కొనే ప్రేక్షకులను ఆశించడం కష్టం. ఇంట్లోనే కూర్చుని చూడొచ్చు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు లాంటి సౌలభ్యాలు జనాలను బయటికి రాకుండా చేస్తాయి. కానీ లక్కీ భాస్కర్ రివర్స్ లో కనిపిస్తున్నాడు. మొన్న అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అప్పుడు మిస్సయ్యి టీవీ, ఫోన్ లో చూస్తున్న వాళ్ళు మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

అసలు విశేషం ఇది కాదు. ఇప్పటికీ బుక్ మే షోలో గత ఇరవై నాలుగు గంటల్లో 7 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన అక్టోబర్ సినిమా ఇదొక్కటే కావడం. అంటే డిజిటల్ లో అందుబాటులో ఉందని తెలిసినా కూడా బిగ్ స్క్రీన్ ఆడియన్స్ దుల్కర్ సల్మాన్ మూవీనే వీకెండ్ ఛాయస్ గా పెట్టుకుంటున్నారన్న మాట. దీంతో పాటే రిలీజైన కిరణ్ అబ్బవరం క వారం క్రితమే ఫైనల్ రన్ కు వచ్చింది. అమరన్ తమిళ వెర్షన్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల సేల్స్ బాగున్నాయి కానీ లక్కీ భాస్కర్ కేవలం తెలుగు వెర్షన్ తోనే ఈ ఫీట్ సాధించాడు. పుష్ప 2 ది రూల్ ఇంకో అయిదు రోజుల్లో వచ్చేస్తాడు కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టాలి.

ఒకటి మాత్రం వాస్తవం. కంటెంట్ కనెక్ట్ అయితే టాలీవుడ్ జనాలు థియేటర్లోనే సినిమా చూసేందుకు ఎంతగా ఇష్టపడతాడనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ అన్నట్టు లక్కీ భాస్కర్ లాంగ్ రన్ నిజమై ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. మెయిన్ సెంటర్స్ లో ఇంకా కొనసాగుతూనే ఉన్న ఈ బ్యాంక్ స్కామర్ మొత్తానికి బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకోవడమే కాదు దుల్కర్ సల్మాన్ కి మొదటి వంద కోట్ల గ్రాసర్ ని ఇచ్చాడు. ఇక నెట్ ఫ్లిక్స్ లో సైతం భాస్కర్ దూకుడు మీదున్నాడు. వచ్చే వారం ఇదే ప్లాట్ ఫార్మ్ మీద అమరన్ వచ్చేస్తుంది కనక ఆలోగా మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేయాలి.