మెగా బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్!

ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ అవార్డుల విషయంలోనూ గ్యారెంటీ ఉండదు. రెండు రకాలుగా సక్సెస్ అయ్యే సినిమాలు అరుదుగా ఉంటాయి. స్లమ్ డాగ్ మిలియనీర్ అనే చిత్రం ఈ కోవకే చెందుతుంది. 2008లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. వరల్డ్ వైడ్ భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి తర్వాతి ఏడాది ఆస్కార్ వేదికలో అవార్డుల పంట పండింది. ఏకంగా ఎనిమిది పురస్కారాలతో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సంచలనం సృష్టించింది. ఇప్పుడీ చిత్రానికి సుదీర్ఘ విరామం తర్వాత సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని సీక్వెల్ హక్కులు సొంతం చేసుకున్న బ్రిడ్జ్ 7 అనే సంస్థ ధ్రువీకరించింది.

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ దర్శకుడు డానీ బోయెల్‌యే ఈ చిత్రాన్ని కూడా రూపొందించనున్నాడు.కొన్ని కథలను ప్రేక్షుకులు ఎప్పుడూ మరిచిపోలేరని.. వాటికి భాషా పరమైన హద్దులు కూడా ఉండవని.. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం కూడా ఆ కోవకే చెందుతుందని.. సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని డానీ బోయెల్ తెలిపాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ పూర్తిగా ఇండియా నేపథ్యంలో సాగే కథ.

అనాథగా పెరిగిన ఓ కుర్రాడు.. తన జీవితంలో ఎదురైన అనుభవాలనే ఆధారంగా చేసుకుని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తరహా గేమ్ షోలో పాల్గొని కోట్లు సంపాదించడం.. మాఫియా వలలో చిక్కుకున్న తన ప్రేయసిని విడిపించుకోవడం.. ఈ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠభరింగా సాగే ఈ చిత్రం అప్పట్లో వివిధ దేశాల్లో భారీ వసూళ్లు సాధించింది. ఇందులో చాలా వరకు భారతీయ నటులే ముఖ్య పాత్రలు పోషించారు.