తగ్గేదే లేదు.. నీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌కు జగన్ సవాల్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదా అంత తేలిగ్గా తెగేలా లేదు. ఇంతకుముందు మెతక వైఖరితో కనిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ వాటాను వాడుకునే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సై అంటే సై అన్నట్లుగా వ్యవహరించడానికి ఆయన సిద్ధం అయిపోతున్నారు.

రాయలసీమ కరవు నివారణ పథకం ద్వారా 14 ప్రాజెక్టులు పనులను చేపట్టేందుకు ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. శ్రీశైలం నుంచి నీటిని వాడుకుంటూ ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా నిర్మించే 27 ప్రాజెక్టుల కోసం అవసరమైన మౌళిక సదుపాయాలు, నిధుల సమీకరణ కోసం ఏపీ ప్రభుత్వం జూన్ 27న ఎస్పీవీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాయలసీమ కరవు నివారణ కోసం 14 ప్రాజెక్టులు నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఐతే ఈ ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవాలంటూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం తప్పనిసరి. ఐతే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్మించిందని తెలంగాణ సర్కారు ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచితే తాము తీవ్రంగా నష్టపోతామని.. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో సాగు, తాగు నీటికి కష్టాలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

ఐతే విభజన చట్టం ప్రకారం శ్రీశైలం నుంచి తమ వాటాను కచ్చితంగా వాడుకుంటామని.. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏంటని ఏపీ సర్కారు వాదిస్తోంది. దీనిపై కొంత కాలంగా ఇరు ప్రభుత్వాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి తమ వాటా నీటిని ఏపీ ప్రభుత్వం 120 రోజుల్లో తీసుకుంటుండగా.. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడం ద్వారా అంతే నీటిని 30 నుండి 40 రోజుల్లోనే తీసుకోవాలని చూస్తోంది.