సురేష్ బాబే దిగిపోయాడంటే..

పోయినేడాది కరోనా-లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డ కొన్ని రోజులకు కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయబోతుంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఐతే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో నిర్మాతలు కొంచెం ఆచితూచే వ్యవహరించారు. పరిస్థితులు బాగుపడతాయేమో అని చాన్నాళ్లే ఎదురు చూశారు. ఎంతకీ థియేటర్లు తెరుచుకోక పోవడంతో నిశ్శబ్దం, వి లాంటి పెద్ద సినిమాలను ఓటీటీలకు ఇచ్చేయక తప్పలేదు. ఇవి కాక కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. కొన్ని సినిమాలను మాత్రం పట్టుబట్టి ఆపుకున్నారు. అందుకు తగ్గ ఫలితమే దక్కింది. ఐతే మళ్లీ థియేటర్లకు ఇలాంటి కష్టం ఇంకెప్పుడూ ఉండదని అనుకున్నారు కానీ.. కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని వాటిని మళ్లీ మూసుకోక తప్పలేదు. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గి తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసినా.. ఏపీలో మాత్రం సాయంత్రం 6 తర్వాత షరతులు కొనసాగుతున్నాయి.

దీంతో అక్కడా ఇక్కడా రెండు చోట్లా థియేటర్లు తెరుచుకోలేదు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు గురించి హెచ్చరికలు జారీ అవుతుండటంతో థియేటర్లకు ఎప్పటికి పూర్వపు కళ వస్తుందో తెలియట్లేదు. కొత్త సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే విషయంలో స్పష్టత లేక అయోమయానికి గురవుతున్నారు నిర్మాతలు. ఇలాంటి టైంలోనే అగ్ర నిర్మాత సురేష్ బాబు.. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన నారప్ప, దృశ్యం-2, విరాటపర్వం చిత్రాలను ఒక ఓటీటీకి ఇచ్చేసినట్లు అప్‌డేట్ బయటికి వచ్చేసింది. ఈ సమాచారం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వర్గాల్లో కలకలం రేపింది.

చేతిలో బోలెడన్ని థియేటర్లు ఉన్న సురేష్ బాబే.. ఓటీటీకి తన సినిమాలను రాసిచ్చేస్తే.. ఇక మిగతా నిర్మాతల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ కాపీలతో రెడీగా ఉన్న ఈ క్రేజీ చిత్రాలను కొన్నాళ్లు ఆపుకుంటే థియేటర్లు మొదలవగానే వాటికి ఆక్సిజన్ అందిస్తాయని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఆకర్షణ ఉన్న ఇలాంటి సినిమాలను ఓటీటీలకు ఇచ్చేయడం ఎంత వరకు న్యాయమని.. ఇది థియేటర్ల యాజమాన్యాల్లో నిరాశను పెంచేదే అని.. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో థియేటర్లు మూతపడ్డాయని.. సురేష్ బాబు లాంటి నిర్మాత ఒకేసారి మూడు సినిమాలకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంటే.. భవిష్యత్‌పై భయం పెరిగి మరిన్ని థియేటర్లు మూతపడటం ఖాయమని ఆ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.