జక్కన్న ట్వీట్.. ఈసారి పని చేస్తుందా?

జక్కన్న ట్వీట్.. ఈసారి పని చేస్తుందా?

రాజమౌళి ఏదైనా సినిమా గురించి పాజిటివ్ ట్వీట్ పెట్టాడంటే దాని ప్రభావం చాలా ఉంటుంది. గతంలో జక్కన్న తన మిత్రులు.. సన్నిహితుల సినిమాల గురించి ఇలా పాజిటివ్ ట్వీట్లు పెట్టి వాటికి చాలా సాయం చేశాడు. రాజమౌళి ఓ సినిమా చూసి మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడంటే అది పెద్ద సర్టిఫికెట్ లాంటిది. జనాలు ఆయన అభిప్రాయానికి చాలా వాల్యూ ఇచ్చేవాళ్లు. ఐతే ఈ మధ్య జక్కన్న ఎండోర్స్ చేసిన రెండు మూడు సినిమాలు తేడా కొట్టేశాయి. తన మిత్రుడు సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేసిన సినిమాల గురించి కొంచెం అతిగా మాట్లాడి.. పాజిటివ్ ట్వీట్లు పెట్టి తనకున్న క్రెడిబిలిటీని దెబ్బ తీసుకున్నాడు జక్కన్న. ‘రెండు రెళ్లు ఆరు’.. ‘పటేల్ సార్’ లాంటి సినిమాలకు జక్కన్న ప్రచారం కలిసి రాలేదు.

ఐతే ఈసారి జక్కన్న తన భల్లాలదేవుడి కోసం ట్విట్టర్‌ను ఉపయోగించాడు. రానా హీరోగా నటించిన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ గురించి ఈ రోజు పాజిటివ్ ట్వీట్లు పెట్టాడు. ఈ సినిమాలో రానా అదరగొట్టేశాడని.. అతణ్ని చూసి గర్విస్తున్నానని అన్నాడు. దర్శకుడు తేజ మీద కూడా ప్రశంసలు కురిపించాడు. ఎంతో యుక్తితో తేజ ఈ సినిమా తీశాడని.. అందరూ అద్భుతంగా నటించారని చెబుతూ.. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా బాగుందన్న సంకేతాలు ఇచ్చాడు. కాకపోతే ఈ సినిమాకు జనరల్ టాక్ అయితే ఏమంత గొప్పగా లేదు. మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. మరి రాజమౌళి అంచనా సరైందా కాదా అన్నది ఒకట్రెండు రోజులు గడిచాక తెలియొచ్చు. మరి జక్కన్న రానా కోసం మొహమాటానికి ఇలా ట్వీట్ చేశాడా.. ఆయన గుండె లోతుల్లోంచి ఈ మాటలు వచ్చాయా అన్నది ఆయనకే తెలియాలి. ఈ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చే తీర్పును బట్టి కూడా దీనిపై ఓ అంచనాకు రావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు