నారా లోకేష్ కోసం.. రోడ్డెక్కిన‌ నంద‌మూరి కుటుంబం !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఆయ‌న ఓడిపోయారు. అయినా ప‌ట్టుబ‌ట్టి.. ఇక్క‌డే పోటీ చేయాల‌ని… గెల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే నాలుగేళ్లుగా ఆయ‌న ఇక్క‌డి ప్ర‌జ‌లతో మ‌మేకమ‌య్యా రు. ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేశారు. ప్ర‌జ‌ల‌కు సాయం కూడా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గెలుపును కాంక్షిస్తూ.. ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు నారా లోకేష్ కోసం.. నందమూరి కుటుంబం కూడా త‌ర‌లి వ‌చ్చింది. మొత్తం 15 మంది నంద‌మూరి కుటుంబానికి చెందిన వారు.. మంగ‌ళ‌గిరిలో ప్ర‌చారం చేస్తున్నారు. చిత్రం ఏంటంటే.. వీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఏనాడూ.. త‌మ తండ్రి ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా జెండా ప‌ట్టుకున్న‌ది లేదు… నినాదం చేసింది లేదు. అలాంటివారు.. ఈ ద‌ఫా.. రోడ్డెక్కారు. వీరిలో న‌లుగురు అమెరికా నుంచి వ‌చ్చారు. వీరంతా మంగ‌ళ‌గిరి వీధుల్లో తిరుగుతూ.. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు.

నారా లోకేష్‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు. పార్టీ తాలూకు క‌ర‌ప‌త్రాలు, మేనిఫెస్టో ప‌త్రాల‌ను కూడా పంచుతున్నారు. నారా లోకేష్ ను గెలిపిస్తే.. నియోజ‌క‌వ‌ర్గం మ‌రింత డెవ‌ల‌ప్ అవుతుంద‌ని వారు చెబుతున్నారు. ప్ర‌తి ఇంటికీ వెళ్తున్న వీరు.. ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. వీరిలో నంద‌మూరి లోకేశ్వ‌రి పిల్ల‌లు, మ‌న‌వ‌ళ్లు, కుమార్తెలు ఉన్నారు. అదేవిధంగా నంద‌మూరి రామ‌కృష్ణ కుమారుడు.. ఆయ‌న పిల్ల‌లు కూడా.. ప్ర‌చారానికివ‌చ్చారు. నంద‌మూరి జ‌య‌కృష్ణపిల్ల‌లు ఉన్నారు. అంటే దీనిని బట్టి నారా నందమూరి కుటుంబాలు సంపూర్ణంగా కలిసిపోయాయని చెప్పవచ్చు.

ఎక్కువ మంది మ‌హిళ‌లే రంగంలోకి దిగ‌డం గ‌మ‌నార్హం. వీరంతా జెండాలు ప‌ట్టుకుని.. టోపీలు పెట్టుకుని.. ఇల్లిల్లూ తిరుగుతున్నారు. నారా లోకేష్‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు. మ‌రి ఏమేర‌కు ప్ర‌భావితం చేస్తారో చూడాలి. ఇక్క‌డ వాస్త‌వం ఏంటంటే.. ఆనాడు ఎన్టీఆర్ కోసం కూడా వీరెవ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.