అన‌కాప‌ల్లిలో సీఎం ర‌మేష్‌పై వైసీపీ నేత‌ల దాడి.. గాయాలు!

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ కార్య‌క‌ర్త ల మ‌ధ్య నెల‌కొన్న తీవ్ర ఉద్రిక్త‌త‌లు దాడుల‌కు దారితీశాయి. ఈ దాడిలో అన‌కాప‌ల్లి కూట‌మి అభ్య‌ర్థి, బీజేపీ నేత సీఎం ర‌మేష్‌కు గాయాల‌య్యాయి. అంతేకాదు.. సీఎం ర‌మేష్‌ను పోలీసుల వాహ‌నంలో నుంచి దింపి మ‌రీ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొట్టార‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రో ప‌ది రోజులు మాత్ర‌మే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో సీఎం ర‌మేష్‌.. త‌న ప్ర‌చారాన్ని పెంచారు. ఈ క్ర‌మంలో ఆయ‌నతో పాటు కూట‌మి పార్టీల నాయ‌కులు.. కూడా.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం.. బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. ఇక్క‌డ నుంచి బ‌రిలో ఉన్న వైసీపీ అభ్య‌ర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల‌నాయుడు స్వ‌గ్రామం మాడుగుల మండ‌లం తాడువ గ్రామంలో ప్ర‌చారానికి వెళ్లారు. అయితే.. బూడి ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్నారు. ఈ విష‌యాన్ని గుర్తించిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న అనుచ‌రులు.. బీజేపీ ప్ర‌చారాన్ని అడ్డుకున్నారు.

బీజేపీ నేత‌ల‌ను త‌రిమి త‌రిమి కొట్టారు. మా గ్రామానికే(తాడువ‌) వ‌స్తారా? అంటూ.. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రుగులు పెట్టించారు. ఇక‌, ఎక్క‌డో ప్ర‌చారంలో ఉన్న సీఎం ర‌మేష్‌కు ఈ విష‌యం తెలిసి.. ఆయ‌న హుటాహుటిన తాడువ‌కు బ‌య‌లు దేరారు. అయితే.. మార్గం మ‌ధ్య‌లో (తాడువ గ్రామ ప‌రిధిలో) పోలీసులు ర‌మేష్ ను అడ్డుకున్నారు. ఆయ‌న‌ను అరెస్టు చేసి..వాహ‌నంలోకి ఎక్కించి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. అప్ప‌టికే ఈ విష‌యం తెలుసుకున్న బూడి అనుచ‌రులు .. కొంద‌రు నాయ‌కులు పోలీసు వాహ‌నం వ‌ద్ద‌కు చేరుకుని సీఎం ర‌మేష్‌పై భౌతిక దాడికి దిగారు. ఆయ‌న చొక్కాను చింపేసి పిడిగుద్దులు కురిపించారు.

ఎక్క‌డి నుంచో వ‌చ్చి ఇక్క‌డ పోటీ చేస్తావా? అంటూ.. దూషించారు. దీంతో ప‌రిస్థితి మ‌రింత తీవ్రం కావ‌డంతో పోలీసులు స్వ‌ల్ప లాఠీ చార్జి చేసి వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అక్క‌డ నుంచి పంపించి.. సీఎం ర‌మేష్‌ను స‌మీపంలోని దేవ‌ర‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్కు త‌ర‌లించారు. ఇదిలావుంటే.. ఈ ఘ‌ట‌న‌పై బూడి ముత్యాల‌నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను త‌న‌ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. త‌న ఇంటిపై డ్రోన్లు ఎగుర‌వేశార‌ని అందుకే.. కార్య‌క‌ర్త‌ల‌కు కోపం వ‌చ్చి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.కాగా, ఈ ఘ‌ట‌న‌తో అన‌కాప‌ల్లిలో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి.