పార్టీ పెట్టే ముందు పాట‌తో వ‌చ్చాడు


సినిమా వాళ్లు రాజ‌కీయాల్లోకి రావ‌డం త‌మిళ‌నాట సాధార‌ణ వ్య‌వ‌హారం. ప్ర‌స్తుతం త‌మిళంలో బిగ్గెస్ట్ హీరోగా అవ‌త‌రించిన విజ‌య్ కూడా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతున్నాడు. త‌మిళ వెట్రి క‌ళ‌గం పేరుతో అత‌ను కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు.. ప్ర‌స్తుతం చేస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం త‌ర్వాత మ‌రో చిత్రం చేసి రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేస్తాన‌ని.. 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాను చివ‌ర‌గా చేయ‌బోయే రెండు చిత్రాల్లో త‌న రాజ‌కీయ ఉద్దేశాల‌ను చెప్ప‌క‌నే చెబుతాడ‌ని భావిస్తుండ‌గా.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం నుంచి రిలీజ్ చేసిన తొలి పాట‌లోనే ఆ ర‌క‌మైన హింట్స్ ఇచ్చేశాడు విజ‌య్. ఈ పాట అంతా విజ‌య్ రాజ‌కీయ ఎంట్రీ గురించి చెప్ప‌క‌నే చెబుతూ సాగింది.

విజిల్ పోడు అనే చెన్నై సూప‌ర్ కింగ్స్ టీం నినాదాన్నే ఈ పాట లిరిక్ టైటిల్‌గా మార్చేసింది చిత్ర బృందం. విజ‌య్ స్వ‌యంగా ఆల‌పించిన ఈ పాట‌లో ఆరంభ వాక్యాలు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నాయి. పార్టీ ఒక‌టి పెడ‌దామా.. క్యాంపైన్ మొద‌లు పెడ‌దామా.. మైక్ ప‌ట్టి మాట్లాడ‌దామా అంటూ సాగాయి ఆరంభ వాక్యాలు. ఐతే వేరే వ్య‌క్తి క్యాంపైన్ ఏంటి అని అడిగితే.. కాదు కాదు అది షాంపైన్ అని విజ‌య్ క‌రెక్ట్ చేసుకోవ‌డం.. ఆ త‌ర్వాత పాట‌ను కొన‌సాగించాడు.

పాట మ‌ధ్య మ‌ధ్య‌లో కూడా విజ‌య్ రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లుగానే లిరిక్స్ రాశాడు మ‌ద‌న్ కార్కీ. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంక‌ర్ రాజా సంగీత ద‌ర్శ‌కుడు. ప్ర‌భుదేవా సోద‌రుడు రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ అందించ‌గా.. ఈ పాట‌లో విజ‌య్‌తో క‌లిసి ప్ర‌భుదేవా డ్యాన్స్ చేయ‌డం విశేషం. ప్ర‌భుదేవా ఈ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నాడా.. లేక ఈ పాట వ‌ర‌కు క్యామియో రోల్ చేశాడా అన్న‌ది తెలియ‌దు. ది గ్రేటెస్ట్ ఆఫ్ టైం సెప్టెంబ‌రు 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.