ఆరెంజ్ ఎగబడ్డారు మగధీరకు చల్లబడ్డారు

కొన్ని నెలల క్రితం ఆరెంజ్ రీ రిలీజ్ జరిగినప్పుడు వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోనివారు లేరు. యువత రోజుల తరబడి హౌస్ ఫుల్ చేయడం చూసి అది నిజమా కాదాని తెలుసుకోవడానికి స్వయంగా నిర్మాత నాగబాబు థియేటర్లకు వెళ్లిన వైనాన్ని చూశాం. ఒరిజినల్ గా విడుదలైనప్పుడు డిజాస్టరై, నష్టాల దెబ్బకు ఏకంగా తనకు ఆత్మహత్య చేసుకునే ఆలోచన వచ్చే రేంజ్ లో దెబ్బ కొట్టిన ఆరెంజ్ కు ఈ రేంజ్ స్పందన ఎవరూ ఊహించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత దానికి కల్ట్ స్టేటస్ రావడం ఒక ఎత్తయితే ఇంత గొప్ప స్థాయిలో ఆదరించడం ఊహకందని అద్భుతమే.

ఇప్పుడు వర్తమానానికి వస్తే రామ్ చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర నిన్న తన పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ రిలీజ్ చేశారు. ఉదయం వేసిన స్పెషల్ షోలకు బాగానే హంగామా కనిపించింది కానీ రెగ్యులర్ ఆటలకు మాత్రం హడావిడి పూర్తిగా తగ్గిపోయింది. ఆరెంజ్ చాలా చోట్ల వారం రోజులు బలంగా నిలబడితే మగధీర మాత్రం సెకండ్ డే నుంచే డ్రాప్ చూపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ ఏదీ లేకపోయినా ఇలా జరగడం విచిత్రమే ఇప్పటికే టీవీ, యూట్యూబ్ లో బోలెడుసార్లు చూశారనేది నిజమే అయినా ఆరెంజ్ కు సైతం ఇదే లాజిక్ వర్తించాలిగా.

కొంచెం వెనక్కు వెళ్తే సూపర్ హిట్ 7జి బృందావన్ కాలనీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అదే ఫ్లాప్ గా చెప్పుకునే ఓయ్ ని మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రభాస్ వర్షం కన్నా రెబెల్ ఎక్కువ పే చేసిందంటే నమ్మగలమా. ఉదయ్ కిరణ్ నువ్వు నేను వచ్చిన సంగతే చాలా మందికి తెలియదు. కానీ ఇవన్నీ వాస్తవాలే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. బ్యాడ్ టాక్ వల్ల ఒకప్పుడు థియేటర్లలో ఆడని సినిమాలను చూసేందుకే ఇప్పటి యూత్ ఆసక్తి చూపిస్తున్నారు. సో గుడ్డిగా అప్పట్లో గొప్పగా ఆడేసిందని హడావిడిగా రీ రిలీజులు చేస్తే ప్రతిసారి ఒకే ఫలితం రాదని తేలిపోయిందిగా.