కలెక్షన్లకు గండి కొడుతున్న క్రికెట్

ఊహించిన దానికన్నా ఈసారి ఐపీఎల్ జ్వరం జనాల్లో ఎక్కువగా ఉంది. దానికి తోడు టీమ్స్ నువ్వా నేనాని ఆడుతుండటంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ కనిపిస్తోంది. నిన్న జరిగిన హైదరాబాద్, ముంబై పోరు చూశాక ఎవరైనా సరే దాని జ్ఞాపకాల నుంచి బయట పడటం కష్టం. అంత అరాచకం జరిగింది. మాములుగానే వేల రూపాయల ఖరీదు ఉండే టికెట్లు బ్లాక్ లో కూడా దొరకని సీన్ నెలకొందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ సీజన్ రెండు నెలలు ఉంది. జియో సినిమాలో ఫ్రీ స్ట్రీమింగ్ ఇవ్వడంతో ప్రతి ఆటకు సగటు పదిహేను కోట్లకు పైగానే వ్యూస్ వస్తున్నాయి.

ఇదంతా కలెక్షన్లకు కుంపటిగా మారింది. ముఖ్యమైన మ్యాచులున్న ప్రతిసారి థియేటర్లు వెలవెలబోతున్నాయి. వీక్ డేస్ లోనూ స్ట్రాంగ్ గా ఉండాల్సిన ఓం భీమ్ బుష్ దీని వల్ల తీవ్రంగా ప్రభావితం చెందుతోంది. ఇంకోపక్క ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతుండటంతో జనాల దృష్టి అటు కూడా ఉంది. రేపు విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ ఇంకా తీవ్రంగా జరగాల్సిన మాట వాస్తవం. కానీ పబ్లిక్ మూడ్ ఇలా డివైడ్ అయిపోవడం కంటెంట్ ఉన్న సినిమాల మీద ఎఫెక్ట్ ఇస్తోంది. సో బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే స్ట్రాంగ్ గా నిలబడొచ్చు.

అధిక శాతం పిల్లల పరీక్షలు అయిపోయి వేసవి మొదలయ్యాక వీలైనంత వేగంగా థియేటర్ ఆక్యుపెన్సీలు పెరగాలి. ఇంట్లో హ్యాపీగా ఐపీఎల్ చూద్దామనే ధోరణి పెరిగితేనే ప్రమాదం. ఏప్రిల్ 5 ఫ్యామిలీ స్టార్ వస్తోంది. దీని మీద పెద్ద ఎత్తున పెట్టుబడులున్నాయి. విజయ్ దేవరకొండ నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. టిల్లు స్క్వేర్ కనక సక్సెస్ అయితే ఈ రెండూ బాక్సాఫీస్ కి రిలీఫ్ ఇస్తాయి. మే 26 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. అంతదాకా స్టార్ హీరోలకు ఇబ్బంది ఉండదు కానీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు మాత్రం చిక్కులు చికాకులు తప్పేలా లేవు.