శుభవార్తలు చెప్పిన దిల్ రాజు

గేమ్ ఛేంజర్ ఆలస్యానికి కారణం దర్శకుడు శంకరే అయినా దానికి సంబంధించి అభిమానుల నుంచి ఎప్పటికప్పుడు నిరసన ఎదురుకుంటున్నది మాత్రం నిర్మాత దిల్ రాజే. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్ లో ఆయన అతిథిగా హాజరయ్యారు. ఇంకొక్క నాలుగైదు నెలలు ఓపిక పడితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసిన ప్యాన్ ఇండియా మూవీని చూసుకోవచ్చని మంచి గుడ్ న్యూస్ చెప్పారు. తేదీని స్పష్టంగా చెప్పకపోయినా ఇన్ సైడ్ టాక్ ప్రకారం అక్టోబర్ 31 లాక్ చేసుకున్నారని, కాకపోతే శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని వినికిడి.

ఇక జరగండి జరగండి పాట గతంలో లీక్ అవ్వడం వల్ల ఇవాళ మీకు అంత ఎనర్జీ ఇవ్వలేకపోయిందని ఒప్పుకున్న దిల్ రాజు నాలుగైదు రోజుల తర్వాత మాస్ లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ ఉంటుందని తేల్చేశారు. మొత్తం మూడు పాటలు థియేటర్ కుర్చీల్లో కూర్చుని చూడలేనంత గొప్పగా డాన్సులు ఉంటాయని ఊరించారు. దిల్ మావా అప్డేట్ అంటూ నన్ను తిట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, శంకర్ అనే శాటిలైట్ సిగ్నల్ ఇస్తే తప్ప నేను ఏం చేయలేనని జరుగుతున్నది వివరించే ప్రయత్నం చేశారు. రెండు నెలల్లో మొత్తం పూర్తవుతుందని చెప్పారు.

ఇంతకన్నా శుభవార్తలు మెగాభిమానులకు ఏముంటాయి. దర్శకుడి వల్ల సినిమాకు సంబంధించిన కబుర్లు ఎక్కువ చెప్పలేని పరిస్థితి రావడం దిల్ రాజుకి బహుశా ఇదే మొదటిసారి అనిపిస్తోంది. ఇండియన్ రెండు భాగాలను గేమ్ ఛేంజర్ తో సమాంతరంగా తీయడం వల్ల ఈ సమస్య వచ్చిందనేది ఓపెన్ సీక్రెట్ అయినా ఎవరూ దాన్ని బయటికి చెప్పరు చెప్పలేరు. ఏదైతేనేం మొత్తానికి చరణ్ మూవీ అందరూ అనుకున్నట్టు ఈ సంవత్సరమే అది కూడా ప్రచారంలో ఉన్నట్టు డిసెంబర్ క్రిస్మస్ కాకుండా ఇంకా ముందుగానే రావడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదేగా వాళ్ళు కోరుకున్నది.