సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉంటున్నప్పటికీ.. నటుడిగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంటాడు జి.వి.ప్రకాష్ కుమార్. ప్రతి సంవత్సరం హీరోగా ఒకటికి మించి సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నాడతను. ఈ ఏడాది హ్యాపీ రాజ్, ఇమ్మోర్టల్ అనే సినిమాలతో అతను ప్రేక్షకులను పలకరించాడు. ఇంకో రెండు సినిమాలు చేతిలో ఉండగానే.. తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అదే.. అన్బుదాన్ మహి.
ఓటీటీలో వివిధ భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘జో’ సినిమాను డైరెక్ట్ చేసిన హరిహరన్ రామ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రమిది. ‘జో’ హీరోయిన్ మాళవిక మనోజ్ ఇందులో జి.వి.ప్రకాష్‌కు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘అన్బుదాన్ మహి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఐతే ఈ సినిమా టైటిల్ చూశాక జనం ఉస్సూరుమంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు.
జి.వి.ప్రకాష్ కుమార్ కొత్త సినిమా గురించి ముందు రోజు ‘మహి రిటర్న్స్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. దీంతో మహేంద్రసింగ్ ధోనికి ఈ సినిమాతో సంబంధం ఉందని.. అతను అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందని ఒక ప్రచారం నడిచింది. కానీ చివరికి చూస్తే జి.వి. ఇందులో మహి అనే పాత్ర మాత్రమే చేస్తున్నాడని, దీనికి ధోనికి ఏ సంబంధం లేదని వెల్లడైంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూ ఉండడం వల్ల తమిళ అభిమానులతో ధోనికి గొప్ప అనుబంధం ఏర్పడింది. ఆ బంధాన్ని క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా.. తమిళంలో ‘ఎల్‌జీఎం’ అనే సినిమాను నిర్మించాడు. ఈ నేపథ్యంలో ధోని మళ్లీ ఒక తమిళ సినిమాలో భాగం అవుతున్నాడని, అతను రాసిన కథతో సినిమా వస్తోందని అంటే నెటిజన్లు నమ్మేశారు. కానీ అందులో ఏ నిజం లేదని.. కేవలం మహి అనే పేరును, ఆ పేరును రాయడంలో ధోని సిగ్నేచర్ స్టైల్‌ను ఈ చిత్ర బృందం వాడుకుంటోందని.. అంతకుమించి ఏమీ లేదని క్లారిటీ వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates