గంభీర్ బ్రో… వరల్డ్ కప్‌కు ఉన్నది ఏడాదే

వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుండగా టీమ్ఇండియాకు ఓ సమస్య పెద్ద తలనొప్పిగా మారుతోంది. స్వదేశంలో భారీ స్కోర్లు చేసే భారత బ్యాటర్లు విదేశాల్లో పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో 89 పరుగులకే ఆలౌట్ కావడం దీనికి మరో ఉదాహరణ. ఈ ఓటమి తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా భారత బ్యాటింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు.

నాలుగో వన్డేలో న్యూజిలాండ్ నిర్దేశించిన 334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కేవలం 26.4 ఓవర్లలో ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే గంభీర్‌ను ఎక్కువగా బాధిస్తున్నది 89 పరుగులకు ఆలౌట్ కావడం కంటే, అంత త్వరగా వికెట్లు కోల్పోవడమే. రెండో వన్డేలోనూ 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఒక దశలో భారత్ 111 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ మ్యాచ్‌లో గెలిచినా బ్యాటింగ్ బలహీనత బయటపడింది.

2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. అక్కడి పిచ్‌లపై పేసర్లకు సహకారం లభించే అవకాశముంది. న్యూజిలాండ్‌లో ఎదురైన పరిస్థితులే వరల్డ్ కప్‌లోనూ ఉండవచ్చని గంభీర్ చెప్పాడు. భారత్‌లో బౌలర్లకు పెద్దగా సహకారం లేని పిచ్‌లపై ఆడటం ఒక ఎత్తయితే, బంతి కలిసొచ్చే విదేశీ పిచ్‌లపై పరుగులు సాధించడం మరో ఎత్తు. అందుకే ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని భావిస్తున్నాడు.

ముఖ్యంగా టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. భారీ టార్గెట్ లను ఛేదించేటప్పుడు పాట్నర్షిప్ నెలకొల్పడం కీలకం. కానీ న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత బ్యాటర్లు కనీసం 30 ఓవర్లు కూడా నిలవలేకపోయారు. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్‌లో బలమైన పేస్ బౌలింగ్ ఉన్న జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎలా సిద్ధం చేస్తారనేది గంభీర్ ముందున్న అసలైన సవాలు. మరోవైపు వరల్డ్ కప్‌లో భారత్ ఆరంభ మ్యాచ్ నుంచే కఠినమైన ప్రత్యర్థిని ఎదుర్కోనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. టోర్నమెంట్ ప్రారంభంలోనే రెండు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి.