అమెరికా విమానాశ్రయాల్లో ఏం జరుగుతుంది?

అమెరికాలో శుక్రవారం విమాన ప్రయాణాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చాలా విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రకటన రావడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను కొంతసేపు వేచి ఉండాలని అధికారులు సూచించారు. మరికొందరు విమానాల నుంచి కిందకు దిగి ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం ప్రయత్నించారు.

ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తడమే ఈ పరిస్థితికి కారణమని FAA వెల్లడించింది. విమాన ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ అంతరాయం కారణంగా అమెరికా అంతటా వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. ఫ్లైట్ అవేర్ గణాంకాల ప్రకారం, అమెరికాలోకి, బయటకు, దేశీయంగా ప్రయాణించే 10,300కు పైగా విమానాలు ఆలస్యమవగా, సుమారు 1,479 విమానాలు రద్దయ్యాయి.

ఈ ఘటన వెనుక సైబర్ దాడి ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ తెలిపారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడిన సమస్య వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ ప్రభావం అంతర్జాతీయ విమానాలపై కూడా పడింది. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే విమానాలను పరిస్థితిని బట్టి అనుమతించారు. మరోవైపు NBA, NHL జట్ల ప్రయాణాలపైనా ఈ అంతరాయం ప్రభావం చూపించింది.

అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను నిలిపివేయడం చాలా అరుదైన విషయం. 2001లో సెప్టెంబర్ 11 దాడుల తర్వాత, 2023లో ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య తలెత్తినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తాజా ఘటనతో అమెరికా విమానయాన వ్యవస్థలోని కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలపై మరోసారి చర్చ మొదలైంది.