ఇప్పుడు దేశానికి మోదీఏ కరెక్ట్

వ‌చ్చే 2029 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కూట‌మిగానే ముందుకు వెళ్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. గ‌తంలో 2014లో కూడా కూట‌మిగానే ఎన్నిక‌ల‌కు వెళ్లామ‌ని.. అప్పుడు కూడా ప్ర‌జ‌లు ఆద‌రించార‌ని చెప్పారు. అయితే, 2019లో మాత్రం కొన్ని విభేదాల కార‌ణంగా ఒంట‌రిగా పోటీ చేశామ‌న్నారు. కానీ, కూట‌మి విష‌యంలో ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇస్తున్న నేప‌థ్యంలో 2019లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను ఇక‌పై చేయ‌మ‌ని.. ఆ త‌ప్పులు పున‌రావృతం కావ‌ని స్ప‌ష్టం చేశారు. విశాఖలో జ‌రుగుతున్న సీఐఐ స‌ద‌స్సులో మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పారు. 1991కు ముందు లెఫ్ట్ వింగ్.. రైట్ వింగ్ అనే విధానాలు ఉండేవని… కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలిపారు. ఇప్పుడు ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉందని చెప్పారు.

పిల్ల‌ల విష‌యం..

గ‌తంలో తానే ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలని చెప్పానని… కానీ ఇప్పుడు తన ఆలోచనలను మార్చుకున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ఇద్దరు లేదా.. అంతకు మించిన పిల్లలు ఉండాలని తాను సూచిస్తున్న విధానాన్ని అమలు చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. కానీ వివిధ దేశాల్లోని పరిణామాలు చూసిన తర్వాత దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన విధానాలను మార్చుకున్నానని తెలిపారు. అమలు కష్టమైనా సరే… ప్రజలకు మంచి జరుగుతోందని భావిస్తే చెబుతూనే ఉంటానన్నారు.

మోడీనే సరైన నాయ‌కుడు

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి ప్రధాని నరేంద్ర మోడీనే సరైన ఛాయిస్ అని చంద్ర‌బాబు తెలిపారు. ఆయనే రైట్ పర్సన్ అని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి వచ్చే 20 ఏళ్లు చాలా కీలకమైన సమయమని… ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని కొల్పోకూడదని ఉద్ఘాటించారు.

స‌ర్‌పై నింద‌లే.. వాస్త‌వాలు కాదు!

ప్రతి 20-25 ఏళ్లకోసారి కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌ ఎస్ఐఆర్ నిర్వహించాల్సిందేనన్న సీఎం చంద్రబాబు… ఓటు మిస్ అయిందని ఫిర్యాదులు ఏపీలో రాలేదని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీకి గ్రామస్థాయిలో నెట్ వర్క్ ఉంటుందని… వాటిని సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాదని చెప్పారు. ఓట్ల తొలగింపు అనేది కేవలం అపోహలేనని.. వాస్తవం కాదని చెప్పారు. అపోహల ఆధారంగా రాజకీయం చేయాలనుకోవడం సరికాదన్నారు.

యువ‌తే కీల‌కం

రాజ‌కీయ నేత‌లు యువతతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతూనే ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. విభిన్న వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఆందోళనలు జ‌ర‌గ‌వ‌న్నారు. ప్రజలతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతూ సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడమే మంచి నాయకత్వం అని అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో తాము నిరంతరం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామ న్నారు.

అలా చేయ‌క‌పోవ‌డం ఇబ్బందే..

అధికారంలో ఉన్న స‌మ‌యంలో పార్టీని తాను ప‌ట్టించుకోలేద‌ని.. దీంతో ఎన్నికల్లో ఇబ్బందులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. రాజకీయం-పరిపాలన వ్యవహరాల మధ్య బ్యాలెన్స్ తప్పడం వల్ల ఓ సంద‌ర్భంలో ఓడిపోయామ‌న్నారు. కానీ ఈసారి రాజకీయం-పరిపాలన మధ్య బ్యాలెన్స్ చేస్తున్నానని ఇకపై తప్పులు జరగవని స్పష్టం చేశారు. కూటమిగా జనసేన, బీజేపీలతో చక్కటి సమన్వయంతో పని చేస్తున్నామన్నారు.

డేటా సెంట‌ర్‌పై విష ప్ర‌చారం

డేటా సెంటర్ల వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉండదని… నీటి వినియోగం విషయంలో కూడా ఆందోళనలు అక్కర్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కానీ, కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని విష ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. గోదావరి జలాలు ప్రతి ఏడాది 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని… పోలవరం ఎడమ కాల్వ ద్వారా విశాఖకు వంద టీఎంసీల నీటిని తెచ్చే అవకాశం ఉందని తెలిపారు. డేటా సెంటర్లకు 3.5 టీఎంసీల నీటిని వినియోగిస్తారని… గోదావరి జలాలతో డేటా సెంటర్లకే కాకుండా… తాగు, సాగు, పరిశ్రమ అవసరాలకు సమృద్ధిగా నీటిని వినియోగించుకోవచ్చన్నారు.