ఏఐ కంపెనీల్లో వారికి 5 కోట్లు

టెక్నాలజీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఏఐ నిపుణులకు భారీ జీతాలు ఇస్తారని తెలుసు. కానీ ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రముఖ ఏఐ కంపెనీలు మాజీ గూఢచారులు, ఇంటెలిజెన్స్ అధికారుల కోసం కూడా లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, ఎన్విడియా వంటి సంస్థల్లో ఇలాంటి నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. వీరికి ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల డాలర్ల వరకు జీతాలు ఆఫర్ చేస్తున్నారు. భారత కరెన్సీలో దాదాపు రూ.1.8 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది.

ఏఐ టెక్నాలజీ అభివృద్ధి కోసం కంపెనీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కొత్త చిప్స్ డిజైన్లు, ఏఐ మోడళ్లకు సంబంధించిన సమాచారం ఇతర కంపెనీలు లేదా విదేశీ సంస్థలకు చేరితే భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే సైబర్ దాడులను అడ్డుకోవడంతో పాటు కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ద్వారా రహస్యాలు బయటకు వెళ్లకుండా చూసేందుకు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను నియమించుకుంటున్నాయి.

వీరి పని కంప్యూటర్లను హ్యాక్ చేసేవాళ్లను పట్టుకోవడమే కాదు. కంపెనీ ఉన్నతాధికారులతో స్నేహం పేరుతో దగ్గరయ్యేవాళ్లను కూడా గమనిస్తారు. కాఫీ షాపులు, జిమ్‌లలో పరిచయాలు పెంచుకొని రహస్యాలు సేకరించే ప్రయత్నాలను గుర్తిస్తారు. వ్యక్తిగత విషయాలతో ఉద్యోగులను బెదిరించి సమాచారం రాబట్టే ప్రమాదాలను కూడా అంచనా వేస్తారు.

ఇటీవల ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంబంధాలపై వచ్చిన ఆరోపణలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ఆయనతో సంబంధం ఉన్నట్లు చెబుతున్న మహిళపై చైనా గూఢచారి అనే ఆరోపణలు వచ్చాయి. అయితే కంపెనీ రహస్యాలు బయటకు వెళ్లినట్లు ఆధారాలు లేవని ఎన్విడియా తెలిపింది. చైనా కూడా ఆ ఆరోపణలను ఖండించింది.

మరోవైపు ఓపెన్‌ఏఐ ఇప్పటికే అమెరికా జాతీయ భద్రతా సంస్థ మాజీ డైరెక్టర్ పాల్ నకసోన్‌ను తన బోర్డులో చేర్చుకుంది. ఆంత్రోపిక్ కూడా మాజీ సీఐఏ, ఎన్ఎస్ఏ అధికారులను సలహాదారులుగా నియమించింది. నెదర్లాండ్స్‌కు చెందిన చిప్ తయారీ పరికరాల సంస్థ ఏఎస్ఎంఎల్ అయితే కనీసం పదేళ్ల గూఢచర్య నిరోధక అనుభవం ఉన్న అధికారుల కోసం వెతుకుతోంది. ఏఐ రంగంలో సాంకేతిక నిపుణులతో పాటు రహస్యాలను కాపాడే నిపుణులకూ భారీ డిమాండ్ ఏర్పడింది.