2018 టాంపరింగ్ గొడవ… వార్నర్ ఒకవైపు, కమిన్స్ మరోవైపు!

ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ వివాదం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మొదలైంది. 2018లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో కొన్ని విషయాలు బయటపెట్టాడు. అప్పట్లో జట్టులోని అందరికీ బంతిని శాండ్‌పేపర్‌తో రుద్దే విషయం తెలుసని ఆరోపించాడు. దీనికి డేవిడ్ వార్నర్ మద్దతివ్వగా, ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ మాత్రం తీవ్రంగా ఖండించాడు. దీంతో అప్పటి ఘటనపై ఆస్ట్రేలియా ఆటగాళ్లే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.

2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టులో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. ఈ ఘటనలో స్టీవ్ స్మిత్, వార్నర్‌పై ఏడాది నిషేధం విధించారు. బాన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే ఆ ముగ్గురికే శిక్షలు విధించడం సరైన నిర్ణయం కాదని ఖవాజా తన ‘సబ్ర్’ పుస్తకంలో పేర్కొన్నాడు. జట్టులో మరికొందరికి కూడా ఈ వ్యవహారం తెలుసని ఆరోపించాడు.

ఖవాజా వ్యాఖ్యలకు వార్నర్ మద్దతివ్వడం ఈ వివాదంలో పెద్ద ట్విస్ట్. అతడు చెప్పిన విషయాలు పూర్తిగా నిజమని వార్నర్ ప్రకటించాడు. కానీ కమిన్స్ మాత్రం శుక్రవారం సిడ్నీలో దాదాపు 70 నిమిషాలపాటు మీడియాతో మాట్లాడి ఆరోపణలను ఖండించాడు. శాండ్‌పేపర్‌ను మైదానంలోకి తీసుకెళ్తున్న విషయం తనకు తెలియదని అన్నారు. బౌలర్లు కలిసి అలాంటి ప్లాన్ రూపొందించారనే ఆరోపణలో నిజం లేదని చెప్పాడు.

అయితే ఖవాజా చెప్పిన మరో విషయం కమిన్స్‌కు మరింత కోపం తెప్పించింది. శాండ్‌పేపర్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బాన్‌క్రాఫ్ట్‌ను హెచ్చరించినట్లు ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు. తప్పు జరుగుతోందని తెలిసినప్పుడు అప్పుడే ఎందుకు ఆపలేదని కమిన్స్ ప్రశ్నించాడు. ఖవాజా తన స్నేహితుడే అయినప్పటికీ ఇతర ఆటగాళ్ల పేరుప్రతిష్ఠలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని విమర్శించాడు.

మరోవైపు అప్పటి ఆస్ట్రేలియా జట్టు వ్యవహారశైలి బాగాలేదని కమిన్స్ అంగీకరించాడు. గెలుపు కోసం ఎంతకైనా వెళ్లే పరిస్థితి ఉండేదని, ప్రత్యర్థులతో పాటు అంపైర్లతోనూ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించేవారని చెప్పాడు. అయితే ఆ వాతావరణం ఉండటానికి, శాండ్‌పేపర్ ఉపయోగించే ప్లాన్ అందరికీ తెలియడానికి తేడా ఉందని వివరించాడు. ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ చేపట్టే ఉద్దేశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించింది. కమిన్స్ కూడా చట్టపరమైన చర్యలకు వెళ్లబోనని చెప్పాడు.