చెన్నై ఆటోల్లో తిరుగుతున్న ఓజీ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి, ఆయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ఒక రేంజ్ ఉంటుంది. లగ్జరీ కార్లలో తిరుగుతూ, ఫైవ్ స్టార్ హోటళ్ళలో భోజనం చేస్తాడని అనుకుంటాం. కానీ పవన్‌తో ‘ఓజీ’ సినిమా చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సుజీత్ మాత్రం.. తన సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఈ యువ దర్శకుడు తాజాగా చెన్నైలోని ఒక మామూలు మెస్‌లో తెలుగు జనాలకు దర్శనమిచ్చి షాకిచ్చాడు. అక్కడ అందరితో కలిసి మామూలుగా భోజనం చేస్తున్న సుజీత్‌ను కొందరు తెలుగు కుర్రాళ్లు గుర్తుపట్టారు. ఇంత పెద్ద డైరెక్టర్‌ ఒక రోడ్ సైడ్ మెస్‌లో కూర్చుని భోజనం చేస్తున్నాడేంటని ఆశ్చర్యపోయారు. సుజీత్ భోజనం పూర్తి చేసేవరకు ఎదురు చూసిన ఆ కుర్రాళ్లు.. తర్వాత ఈ డైరెక్టర్‌తో ముచ్చటించారు.

తాము సీఏ చదువుతున్నట్లు చెబితే.. తాను కూడా సీఏ డిస్కంటిన్యూడ్ అని చెప్పాడు సుజీత్ వాళ్లకు. తర్వాత ఆ కుర్రాళ్లు తీసిన షార్ట్ ఫిలిమ్స్ చూపిస్తే వాటి మీద ఒక లుక్కేసి, ఇన్‌స్టాలో షేర్ చేయమని చెప్పి వెళ్లిపోయాడు. ఐతే వెళ్లేటపుడు సుజీత్ మరోసారి షాకిచ్చాడు. ఏదో లగ్జరీ కారు ఎక్కుతాడేమో అనుకుంటే.. సింపుల్‌గా ఒక ఆటోను ఆపి అందులో ఎక్కాడు. దీంతో ఆ కుర్రాళ్లు మరింత అవాక్కయి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన సుజీత్ 24 ఏళ్ల వయసులోనే ‘రన్ రాజా రన్’ తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ‘సాహో’ లాంటి భారీ చిత్రం తీశాడు. అది అనుకున్నంతగా ఆడకపోయినా.. తనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక పవన్ కళ్యాణ్‌తో సుజీత్ తీసిన ‘ఓజీ’కి మామూలు హైప్ రాలేదు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు నానితో ‘బ్లడీ రోమియో’ తీస్తున్న సుజీత్.. దీని తర్వాత ‘ఓజీ-2’ తీయబోతున్న సంగతి తెలిసిందే.