గుట్కా నమిలి బయటకు ఉమ్మడం ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. ఇంటి మూడో అంతస్తు బాల్కనీ నుంచి గుట్కా ఉమ్మగా, ఆ ఉమ్మి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలినట్లు సమాచారం. దీంతో విద్యుత్ షాక్కు గురైన వృద్ధుడు తీవ్రంగా కాలిపోయి మృతి చెందాడు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో మరో విషయం కూడా బయటపడింది. ఆ ప్రాంతంలో ఇళ్లకు ప్రమాదకరంగా దగ్గరగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లా గంజ్బసోడాలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. గాయత్రి నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్న ప్రభులాల్ గుప్తా (65) మూడో అంతస్తు బాల్కనీలో నిలబడి గుట్కా నములుతున్నాడు. ఆ తర్వాత బయటకు ఉమ్మగా అది సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగకు తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఛతర్పూర్కు చెందిన ప్రభులాల్ వృత్తిరీత్యా తాపీ మేస్త్రీ. గత పదేళ్లుగా అదే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
అయితే ఉమ్మి ద్వారా విద్యుత్ షాక్ ఎలా తగిలిందనే విషయంపై నిపుణులు వివరణ ఇచ్చారు. మన ఉమ్మిలో నీటితో పాటు లవణాలు కూడా ఉంటాయి. అందువల్ల విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది. ఉమ్మి మధ్యలో తెగకుండా ఒకే ధారగా విద్యుత్ తీగను చేరితే దాని ద్వారా కరెంట్ శరీరానికి చేరే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే 11 కేవీ వంటి హైటెన్షన్ తీగలకు మరీ దగ్గరగా ఉన్నప్పుడు నేరుగా తాకకపోయినా గాలి ద్వారా విద్యుత్ దూకే అవకాశం ఉంటుందని వివరించారు.
మరోవైపు ఈ ప్రమాదంపై స్థానికులు విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు అతి దగ్గరగా హైటెన్షన్ తీగలు వెళ్తున్నాయని, వాటిని తొలగించాలని చాలాసార్లు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి కూడా సరిగా లేదని ఆరోపించారు. ఇంటి యజమాని పద్మా చిధర్ కూడా విద్యుత్ లైన్ను మార్చాలని అధికారులను పలుమార్లు కోరినట్లు తెలిపారు. తీగలను మరోచోటికి మారుస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates